Recent Posts

వోల్వోలకు వేగ పరిమితి

1, జనవరి 2014, బుధవారం

హైదరాబాద్, డిసెంబర్ 31: ప్రైవేటు వోల్వో బస్సుల వేగానికి కళ్లెం పడనుంది. ఇటీవలి ఘోర ప్రమాదాల నేప«థ్యంలో వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వోల్వో బస్సుల మితిమీరిన వేగాన్ని కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ప్రైవేట్ వోల్వో బస్సుల వేగ నియంత్రణకు తీసుకునే చర్యలు ఇలా ఉన్నాయి.

 

- గరిష్ఠ వేగాన్ని 100 కిలోమీటర్లకే పరిమితం చేయడం. 'స్పీడ్ లాక్'ఏర్పాటు.

- స్పీడ్‌లాక్ లేకపోతే పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల రద్దు. భారీ జరిమానా,క్రిమినల్ కేసు.

- హైదరాబాద్ సహా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల మీదుగా రాకపోకలు సాగించే ప్రైవేటు వోల్వో బస్సులు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుంటు న్నాయి. దీంతో ఆ సమయాన్ని పూడ్చుకునేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై బస్సులను విపరీతమైన వేగంతో నడుపుతున్నారు. ఇది ప్రమాదాలకు దారి తీస్తోందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఇక పట్టణాలు, నగరాల్లోకి ప్రైవేటు వోల్వో బస్సులను అనుమతించరాదని రవాణా శాఖ ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. అంటే అవి శివారు ప్రాంతాలకే పరిమితమవుతాయి.

- కాంట్రాక్టు క్యారియర్లుగా పర్మిట్లు తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న బస్సుల పర్మిట్ల రద్దు. సంబంధిత చట్టాలు మరింత కఠినతరం.

- ఈ బస్సులకు డిమాండ్‌ను తగ్గించేందుకు ఆర్టీసీకే పెద్ద సంఖ్యలో వోల్వో బస్సులను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు కనీసం 500 వోల్వో బస్సులనైనా ఆర్టీసీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ప్రయాణికుల్లోనూ మార్పు రావాలి: అధికారులు

ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు గురవుతున్న సందర్భాల్లో అందరూ తమనే వేలెత్తి చూపిస్తుండడంపై రవాణా శాఖాధికారుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఫిట్‌నెస్ చూడడం, పర్మిట్లు జారీ చేయడం తదితర ప్రక్రియల విషయంలో రవాణా శాఖ నిశితంగానే వ్యవహరిస్తోందని సంఘం నేతలు పేర్కొన్నారు. స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న బస్సుల విషయంలో తనిఖీలు చేసేందుకు పూర్తి స్థాయి వ్యవస్థ లేదని వెల్లడించారు. వ్యక్తిగత టికెటింగ్, బుకింగ్, ఆన్‌లైన్ టికెటింగ్‌ను ఇకపై కఠినంగా అడ్డుకుంటామన్నారు.ప్రైవేటు బస్సులను ఆశ్రయించే ప్రయాణికుల్లోనూ మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నిబంధనలను పాటించని ప్రైవేటు బస్సులను అడ్డుకుంటున్న సందర్భాల్లో అందులోని ప్రయాణికులే తమపై మండిపడుతున్నారని పేర్కొన్నారు.

వినోదం - తాజా - Google వార్తలు