ఠాణే: నవీముంబైలోని డీవైపాటిల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన భారీ వైద్యశిబిరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు పుస్తకంలో చోటుసంపాదించుకుంది. ఈ విషయాన్ని శ్రీనానాసాహెబ్ ధర్మాధికారి ప్రతిష్టాన్ సంస్థకు చెందిన నిర్వాహకుడొకరు శనివారం వెల్లడించారు. ముంబై, ఠాణే, పుణేలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 1,50,00 మంది ఈ శిబిరంలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. రాయ్‌గఢ్‌కి చెందిన దివంగత నానాసాహెబ్ ధర్మాధికారి కుమారుడు, ఆధ్యాత్మిక గురువు అప్పాసాహెబ్ ధర్మాధికారి ఈ శిబిరాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఈ శిబిరంలో 1,200 మంది వైద్యులు, 5,000 మందికిపైగా పారామెడికల్ సిబ్బందితోపాటు స్వచ్ఛంద కార్యకర్తలు రోగులకు సేవలు అందించారు. 16 బ్లాక్‌లలో మొత్తం 500 రిజిస్ట్రేషన్ కేంద్రాలను నిర్వాహకులు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆరోగ్య, బీమా పథకాల వివరాలను సమగ్రంగా తెలియజేశారు.