Recent Posts

jayanti natarajan resigns

22, డిసెంబర్ 2013, ఆదివారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 21 : ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే గోవా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ పీసీసీ పగ్గాలను కొత్తవారికి అప్పగించిన పార్టీ తాజాగా పలువురు కేంద్ర మంత్రుల సేవలను పార్టీ పటిష్ఠానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. దీంతో జయంతి బాటలో మరికొందరు కేంద్ర మంత్రులు పయనించే అవకాశం ఉంది. రాజీనామా చేస్తారని భావిస్తున్న కేంద్ర మంత్రుల్లో జైరాం రమేష్, సచిన్ పైలట్, జితేంద్ర సింగ్ భన్వర్ ఉన్నారు. జయంతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు జయంతి నిర్వహించిన పర్యావరణ మంత్రిత్వశాఖ బాధ్యతలను వీరప్పమొయిలీకి అప్పగించారు. తమిళనాడుకు చెందిన జయంతి వరుసగా మూడోసారి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చానళ్లలో పార్టీ వాణిని విన్పించడంలో జయంతి దిట్ట. తాను పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నట్లు జయంతి ప్రకటించారు.

జనవరి 17లోగా ఏఐసీసీ పునర్ వ్యవస్థీకరణ
వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఏఐసీసీ పునర్ వ్యవస్థీకరణ తంతును జనవరి 17 నాటికి ముగించాలన్న దిశగా అధిష్ఠానం యోచిస్తోంది. ఆ రోజు జరిగే ఏఐసీసీ భేటీలో పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రాహుల్‌కు సన్నిహితుడైన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భన్వర్‌ను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించే అవకాశం ఉంది. గతంలో ఈయన ఏఐసీసీ కార్యదర్శిగా చేశారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న యువ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీఎన్ సింగ్‌లకు సైతం పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని పీసీసీల్లో మార్పులు
ఇప్పటికే మూడు రాష్ట్రాల పీసీసీల్లో మార్పులు చేసిన కాంగ్రె స్ త్వరలో మరిన్ని పీసీసీల్లో మార్పులను చేయనుంది. ఇటీవల ఎన్నికల్లో పార్టీ పూర్తిగా దెబ్బతిన్న రాజస్థాన్‌లో పీసీసీ పగ్గాలు కేంద్ర మంత్రి సచిన్ పైలట్‌కు అప్పగించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా ఉన్న చంద్రభాన్ పార్టీ ఓటమితో పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఆయన సైతం ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక హర్యానా పీసీసీ చీఫ్ మార్పు సుదీర్ఘకాలంగా చర్చల్లో ఉంది. ఇక్కడ పూల్‌చంద్ మౌలానా స్థానంలో ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న అశోక్ తన్వర్‌ను హర్యానా పీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణను సైతం మారుస్తారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. పార్టీ కోసం పదవులు వదులుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని కేంద్ర మంత్రి సచిన్ పైలట్ పేర్కొన్నారు. ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న వారంతా ప్రాథమికంగా పార్టీ కార్యకర్తలే అని వ్యాఖ్యానించారు.

 

వినోదం - తాజా - Google వార్తలు