Recent Posts

త్వరలో ఏడో వేతన సంఘం

21, డిసెంబర్ 2013, శనివారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వచ్చే ఏడాది మే నెలలో జరిగే సాధారణ ఎన్నికలకు ముందే ఏడో వేతన సంఘాన్ని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా సుమారు ఏభై లక్షల మంది ఉద్యోగుల జీతభత్యాలను సవరించేందుకు ఏడో వేతన సంఘం సిఫార్సులు చేస్తుంది. కేంద్ర మంత్రిమండలి సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే రెండు వారాల్లోగా ఏడో వేతన సంఘం ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఎన్నికలకు వెళ్లేలోగానే ఇదంతా జరిగి పోవాలని భావిస్తున్న ప్రభుత్వం వేతన సంఘం నిర్వహణకు అవసరమైన 3.5 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకరించింది. నిధుల కేటాయింపునకు తాజాగా ముగిసిన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆమోద ముద్ర లభించింది. ఏడో వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మన్మోహన్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత సెప్టెంబర్‌లోనే కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రకటించారు. వేతన సంఘం ఏర్పాటయ్యాక రెండేళ్ల లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 2016 జనవరి 1 నుంచి వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాల్సి ఉంటుంది. చిదంబరం ప్రకటన చేసి నెలలు గడుస్తున్నా వేతన సంఘం ఏర్పాటు విషయమై కేంద్రం ముందుకు ఎలాంటి ప్రతిపాదనలు చేరలేదు. సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జి నేతృత్వంలో పలువురు నిపుణులు, సీనియర్ అధికారులతో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కనీస పెన్షన్ విధానం, భవిష్య నిధి (పిఎఫ్)కి సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

వినోదం - తాజా - Google వార్తలు