న్యూఢిల్లీ, డిసెంబర్ 24: అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలంటే సివిల్స్ రాయాలి. పరీక్ష నుంచి ఇంటర్వ్యూ దాకా వేర్వేరు దశల్లో సాగే ఎంపిక ప్రక్రియలో పాల్గొని..నెగ్గితేనే సర్వీస్ కొట్టినట్టు! కానీ, సర్వీసులో చేరిన తరువాత కూడా, పరీక్ష రాయాల్సి వస్తే? అదీ మళ్లీ తొలి గడి నుంచి నడక మొదలుపెట్టాల్సి వస్తే?.. ఉద్యోగుల పదోన్నతుల విషయంలో కేంద్రం ఇటీవల చేసిన మార్పులుచేర్పులు చూస్తే, రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్) ఈ ప్రశ్నలను ఇక ఎదుర్కొనక తప్పదనిపిస్తున్నది. ఈ మేరకు పాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫార్సులను కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ఏడాది మేలో దీనిపై స్పందించాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. తమిళనాడు తదితర కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా.. ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. పదోన్నతికి అర్హత సాధించాలంటే యూపీఎస్‌సీ పరీక్ష రాసి.. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందేనంటూ నిబంధనావళిని సవరించింది. సీనియారిటీ, వార్షిక ప్రతిభా నివేదికల ఆధారంగా పదోన్నతి కల్పించే విధానానికి అదనంగా పరీక్షని, ఇంటర్వ్యూని జత చేసింది. రాష్ట్ర స్థాయిలో సేవలు అందిస్తున్న సర్వీస్ అధికారుల పదోన్నతులకు దీన్ని తప్పనిసరి చేసింది.
పదోన్నతి ఆశించే సర్వీసు అధికారులకు 54 ఏళ్లు నిండి ఉండాలి. రాష్ట్రస్థాయిలో గ్రూప్ ఏ సర్వీసులో కనీసం ఎనిమిదేళ్లు పనిచేసి ఉండాలి. అప్పుడే వారు యూపీఎస్‌సీ నిర్దేశించే పరీక్షకు అర్హులవుతారు. పరీక్షలో భాగంగా వీరు రెండు పేపర్లు రాయాలి. ఆప్టిట్యూట్‌పై ఒక పేపర్, జనరల్ స్టడీస్‌పై మరో పేపర్ ఉంటుంది. ఆ తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిల్లో గట్టెక్కిన వారి సీనియారిటీని, వార్షిక ప్రతిభా నివేదికలను ఎంపిక బోర్డు పరిశీలిస్తుంది. చేతి రాత పరీక్షకు 30శాతం, సీనియారిటీకి 25 శాతం, వార్షిక ప్రతిభా నివేదికకు మరో 25 శాతం, మౌఖిక పరీక్షకు 20 శాతం మార్పులను వెయిటేజీగా ఇస్తుంది. అమల్లోకి వచ్చిన.. మూడేళ్ల తరువాత ఈ విధానాన్ని సమీక్షించి.. అవసరమైన మార్పులుచేర్పులు చేయడం జరుగుతుందని నిబంధనల్లో పేర్కొన్నారు.