Recent Posts

శాంతిదూత నేలపై శాంతి వెల్లివిరియాలి

26, డిసెంబర్ 2013, గురువారం

వాటికన్ సిటీ, డిసెంబర్ 25: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ సంబరాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. 'ప్రపంచాన్ని ఈ క్రిస్మస్ మరింత మెరుగైన దిశగా నడిపించాలి.' అని పోప్ ఫ్రాన్సిస్ తన పండుగ సందేశంలో ఆకాంక్షించారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ చర్చి సెంట్రల్ బాల్కనీ నుంచి బుధవారం సాయంత్రం 5 గంటలకు పోప్ తన తొలి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. క్రీస్తు జన్మించిన మధ్యప్రాచ్యంలో చర్చలు ఫలించి శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని, సిరియాతోసహా పలు ఆఫ్రికన్ దేశాల్లో యుద్ధమేఘాలు వీడిపోవాలని, శరణార్థుల కష్టాలు తీరాలని పోప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా నడుమ శాంతిచర్చలు ఫలించి శాంతిదూత పుట్టిన నేలపై శాంతిసౌరభాలు వెదజల్లాలని ప్రార్థించారు. ఇరాక్‌ను వెంటాడుతున్న యుద్ధగాయాలు మానిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన రోమన్ క్యాథలిక్కులు భక్తిశ్రద్ధలతో పోప్ సందేశాన్ని ఆలకించారు. అంతకుముందు సోమవారం రాత్రి ఇక్కడ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సైతం పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. క్రీస్తు జన్మ వృత్తాంతంలోని గొప్పదనాన్ని వివరించారు. 'ప్రపంచంలో చీకటి వెలుగులు సహజం. అహంకారంతో మన మనసు తలుపులను మూసివేసుకుంటే మనం చీకటిలోనే మిగిలిపోతాం.' అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. భారతదేశంలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవేతరులు సైతం కేకుల కొనుగోలు కోసం బేకరీల వద్ద బారులు తీరడం కన్పించింది. అధికశాతం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయించారు. కశ్మీర్ లోయలోని శ్రీనగర్ హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిలో భారీ ఎత్తున క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు.

వినోదం - తాజా - Google వార్తలు