కోల్‌కతా, డిసెంబర్ 22: భారత్ 2022 సాకర్ వరల్డ్ కప్ పోటీలకు అర్హత సంపాదిస్తుందని భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ జోస్యం చెప్పాడు. 2017లో అండర్-17 వరల్డ్ కప్‌ను నిర్వహించడం ద్వారా దేశంలో సాకర్‌కు ఆదరణ మరింత పెరుగుతుందని ప్రపంచ కప్ ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో ట్రోఫీ రిలే కొనసాగుతోంది. నేపాల్ నుంచి ఇక్కడికి చేరుకున్న ట్రోఫీకి ఘన స్వాగతం లభించింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బ్రెజిల్ మాజీ స్టార్ ఆటగాడు కార్లొస్ టోరెస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్ర రంగు టీషర్టులో కొత్తగా కనిపించిన సచిన్ మాట్లాడుతూ అండర్-17 వరల్డ్ కప్‌ను నిర్వహించే అవకాశాం రావడం భారత్ అదృష్టమన్నాడు. ఇటీవల కాలంలో మన దేశంలోనూ ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్నదని చెప్పాడు.
వీరాభిమానిని..
సాకర్‌కు తాను వీరాభిమానినని గంగూలీ అన్నాడు. క్రికెటర్‌గా తాను ఎదిగినప్పటికీ, సాకర్ పట్ల విపరీతమైన ఇష్టం ఉందని అన్నాడు. అండర్-17 ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుందని గంగూలీ అన్నాడు. భవిష్యత్తులో మన దేశం కూడా అంతర్జాతీయ ప్రమాణాలను సంపాదించి, వరల్డ్ కప్ పోటీల్లో ఆడే అర్హత పొందడానికి ఇది తొలి అడుగుగా ఉపయోగపడుతుందని చెప్పాడు. బ్రెజిల్‌లో వచ్చే ఏడాది ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరగడం ఎంతో సంతోషకరమని అన్నాడు. అక్కడి ప్రజలు ఫుట్‌బాల్‌తో మమేకమయ్యారని అన్నాడు. నేమార్ వంటి యువ క్రీడాకారుల ఆటను క్రమం తప్పకుండా చూస్తానని గంగూలీ తెలిపాడు.
మారడోనా కంటే పీలే మెరుగు..
అర్జెంటీనా సాకర్ స్టార్ డిగో మారడోనా కంటే బ్రెజిల్ 'లెజెండ్' పీలే మెరుగైన ఆటగాడని బ్రెజిల్ మాజీ కెప్టెన్ కార్లొస్ అల్బర్టో టోరెస్ అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో పీలేను మించి ఆటగాడు లేడని స్పష్టం చేశాడు. పీలేతో కలిసి 12 సంవత్సరాల సాకర్ ఆడిన అదృష్టం తనకు దక్కిందని చెప్పాడు. సాకర్ మాంత్రికుడిగా ఎవరినైనా పేర్కోవాలంటే ముందుగా పీలే పేరునే ప్రస్తావించాల్సి ఉంటుందన్నాడు.
23, డిసెంబర్ 2013, సోమవారండిసెంబర్ 23, 2013
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌కు అర్హత
By Fun Counter
23, డిసెంబర్ 2013, సోమవారం