న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కొరియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ సైనా నెహ్వాల్ వైదొలగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా తాను వచ్చేనెల 7 నుంచి 12వ తేదీ వరకు జరిగే కొరియా ఓపెన్‌లో పాల్గొనలేనని, కాబట్టి తన ఎంట్రీ ఫామ్‌ను రద్దు చేయాలని ఆమె కొరినట్టు భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడు టిపిఎస్ పురీ తెలిపాడు. ఈ సమాచారం తమకు అందినట్టు ధ్రువీకరించిన అతను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాడు. సరైన సమయంలో ఆమె విజ్ఞప్తిని పరిశీలిస్తామని అన్నాడు. సుమారు ఐదేళ్లుగా సైనా దేశవాళీ పోటీల్లో పాల్గొనడం లేదన్న విషయాన్ని విలేఖరులు ప్రశ్నించగా ఈసారి ఆమె ఎంట్రీ పంపిందని అన్నాడు. ఆడే ఉద్దేశం లేకపోతే ఎందుకు దరఖాస్తు చేసుకుంటుందని ప్రశ్నించాడు. అయితే, అరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమె ఇక్కడ ప్రారంభమైన సీనియర్ జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం లేదని వివరించాడు.
జొకొవిచ్ కోచ్‌గా బెకర్
బెల్‌గ్రేడ్, డిసెంబర్ 18: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్‌కు కోచ్‌గా మాజీ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్ వ్యవహరించనున్నాడు. బెకర్ వంటి అత్యుత్తమ ఆటగాడి పర్యవేక్షణలో ఆటకు పదనుపెట్టుకునే అవకాశం లభించడం తన అదృష్టమని జొకొవిచ్ పేర్కొన్నాడు. 46 ఏళ్ల బెకర్ తన కెరీర్‌లో ఆరు గ్రాండ్‌శ్లామ్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. 64 ఎటిపి టోర్నీల్లో విజేతగా నిలిచాడు. వచ్చేనెల 13 నుంచి మెల్బోర్న్‌లో ఆరంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకొవిచ్‌కు అతను కోచ్‌గా ఉంటాడు.
కోపా డెల్ రే సాకర్ టోర్నీ
ప్రీ క్వార్టర్స్‌కు బార్సిలోనా
బార్సిలోనా (స్పెయిన్), డిసెంబర్ 18: కోపా డెల్ రే సాకర్ టోర్నమెంట్‌లో బార్సిలోనా జట్టు ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. కార్టగెనాతో జరిగిన మ్యాచ్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకోవడం ద్వారా మొత్తం మీద సగటు గోల్స్‌ను 7-1కి పెంచుకొని, ప్రీ క్వార్టర్స్ చేరింది. మ్యాచ్ 31వ నిమిషంలో పెడ్రో, 68వ నిమిషంలో సాంచెజ్ మార్టినెజ్ మారియానో, 88వ నిమిషంలో స్టార్ ఆటగాడు నేమార్ గోల్స్ చేసి బార్సిలోనాకు తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టారు. కార్టగెనా ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. ఇలావుంటే, ఎల్చెను విల్లారియల్ 1-0, గిరొనాను గటాఫె 4-1, రిక్రియేటినో హ్యూలొవాను లెవాంటే 4-0, గ్రనెడాను ఎడి అల్కొర్కన్ 2-0 గోల్స్ తేడాతో ఓడించాయి. ఒసాసునా, మలగా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ సాధించాయి.