హైదరాబాద్, డిసెంబర్ 21: 'సమైక్యాంధ్ర జేఏసీ' ఏర్పాటు చేసి... ఉమ్మడిగా ఉద్యమించాలన్న ఏపీఎన్జీవోల యత్నాలు ఫలించలేదు. మరికొన్ని నెలల్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికిప్పుడు రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయలేమని... ఒకవేళ ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం ఉండబోదని కొన్ని పార్టీలు అభిప్రాయపడ్డాయి. అయితే... ఉమ్మడి జేఏసీ లేకపోయినా ప్రస్తుతం విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో వర్గాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొంటున్నారని పేర్కొన్నాయి. అందువల్ల జేఏసీ ఏర్పాటు అంత ముఖ్యం కాదని తేల్చేశాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ఏపీఎన్జీవోలు... రాజకీయ పక్షాలను కలుపుకోవడం, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడం లక్ష్యాలుగా శనివారం ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వైసీపీ మినహా మిగిలిన ప్రధాన పార్టీల నాయకులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీఎన్జీవోలు చేస్తున్న ఉద్యమాన్ని స్వాగతిస్తున్నట్లు సమావేశంలో ముందుగా ఆయా రాజకీయపక్షాలు పేర్కొన్నాయి.
ఆ తర్వాత... అజెండాలో ప్రధానాంశమైన 'రాజకీయ జేఏసీ' ఏర్పాటు విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత సబ్బం హరి మాట్లాడుతూ 'ఇప్పటికిప్పుడు జేఏసీ ఏర్పాటు చేయడం కంఫర్టబుల్ కాదు. అసలు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు అందరం కలిసే పనిచేస్తున్నాం కదా!' అని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న మరికొందరు నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో 'జేఏసీ ఏర్పాటుపై తర్వాత యోచిద్దాం. ఇప్పటికైతే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలోనే ఉద్యమం చేద్దాం' అని నిర్ణయించారు. ఇక రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ఎలా ఎదుర్కోవాలన్న విషయమై చర్చ వచ్చింది. 'బిల్లును అధ్యయనం చేయాల్సిందిగా మా శాసనసభ్యులను కోరాం. ఇరు ప్రాంతాలకు సంబంధించిన ఆదాయాలు, అప్పులు తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఇస్తామని చెప్పారు. ఈ మేరకు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు కూడా. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత అధ్యయనం చేసి కూలంకషంగా చర్చించాల్సి ఉంది. అయితే అందుకు సమయం సరిపోదు. శాసనసభ సమావేశాలను పొడిగించాల్సిందిగా కోరే అవకాశముంటుంది. ఇంతకు ముందు రాష్ట్రాల విభజనలు జరిగిన సందర్భాల్లో కూడా అదే జరిగింది.
ఇప్పుడూ గడువును పొడిగిస్తే... బిల్లుపై పార్లమెంటులో చర్చించేందుకు సమయం సరిపోదు. ఫిబ్రవరి 15 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు' అని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఉద్యమించే విషయంలో మాత్రం అందరం ఒకే పంథాలో వెళదామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి శైలజానా«థ్ మాట్లాడుతూ... 'ఉద్యమం విషయంలో వ్యూహాత్మకంగా వెళదాం. పార్టీలకతీతంగా ఉద్యమంలో అందరూ పాల్గొనాలి' అని సూచించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం చరిత్రాత్మకం, ఇది చారిత్రక అవసరం అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి అందరం కలిసే వెళదామన్నారు. "సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడెనిమిది మంది మాత్రమే విభజనకు అనుకూలంగా, అంటే అధిష్ఠానానికి అనుకూలంగా ఉన్నారు. ఇంతమందికి వ్యతిరేకంగా ఆ కొద్దిమంది ఏమీ చేయలేరు. అయినప్పటికీ వాళ్లపైనా ఒత్తిడి తెద్దాం'' అని శైలజానాథ్ పిలుపునిచ్చారు.
ఇక పంచాయతీలు, మునిసిపాలిటీల నుంచి కూడా 'సమైక్య' తీర్మానాలను తెప్పించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. కలిసి ఉద్యమించాలన్న ఉద్యోగుల ప్రతిపాదనను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం స్వాగతించగా... సీపీఎం నేతలు తన ప్రాధాన్యాలు వివరిస్తూ, ఉద్యమించడం తమకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 'ఉద్యమానికి మద్దతునిస్తాం తప్ప మీతో కలిసి రాలేం. మాకు ప్రత్యేక అజెండా ఉంది' అని స్పష్టం చేశారు. పార్టీల మధ్య సమన్వయంకన్నా ప్రాంతాల మధ్య సమన్వయం ముఖ్యమని వ్యాఖ్యానించారు. "మేం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నాం. కానీ, మా పంథాలో, మా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం. ఎవరితోనూ కలిసి అడుగులు వేయం'' అని చెప్పారు. విభజనపై ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్లాలని లోక్‌సత్తా స్పష్టం చేసింది.
ఇవీ నిర్ణయాలు
సీమాంధ్ర ప్రాంతాల్లోని అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులను కలుపుకొని ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి... ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రతి శాసనసభ్యుడినుంచి అఫిడవిట్ తీసుకోవాలి. శాసనసభ తీర్మానంతో కలిపి వాటిని రాష్ట్రపతికి అందించాలి. (అఫిడవిట్లపై పార్టీలో చర్చించి చెబుతామని టీడీపీ నేతలు చెప్పారు.)
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మరోమారు అవిశ్వాస తీర్మానం ఇవ్వాలి. (అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు పడేస్తే... ప్రభుత్వ వ్యతిరేకత పోయి, కాంగ్రెస్‌పై సానుభూతి పెరుగుతుందని సబ్బం హరి వ్యాఖ్యానించారు).
అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు, సంఘాలతో మరో రెండుమూడు రోజుల్లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఖరారు.
పాల్గొన్నది వీరే
రాష్ట్ర మంత్రి శైలజానాథ్, పార్లమెంటు సభ్యులు వైఎస్ చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ళ నారాయణ (తెలుగుదేశం), సబ్బం హరి కాంగ్రెస్), శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, కేఈ ప్రభాకర్, శివరామరాజు (తెలుగుదేశం), ఉగ్ర నర్సింహారెడ్డి (కాంగ్రెస్), సీపీఎం నేతలు వై. వెంకటేశ్వరరావు, వీరయ్య, లోక్‌సత్తా, సమాజ్‌వాదీ పార్టీల నేతలు కటారు శ్రీనివాస్ రావు, జగదీశ్ యాదవ్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత జగదీశ్, సమైక్య ఉద్యమ నేతలు చలసాని శ్రీనివాస్, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నేతలు మురళీకృష్ణ, కృష్ణయ్య సహా వివిధ ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.