హైదరాబాద్, డిసెంబర్ 24 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రాష్ట్రంలోని 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన సమస్త సమాచారాన్ని డిజిటలైజ్ చేయనున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ తెలిపారు. డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ వల్ల ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. కార్పొరేషన్ ఉద్యోగులు, సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగుల వివరాల సేకరణకు కూడా రంగం సిద్ధం చేస్తున్నామని... దీని కోసం వారంలో నమూనా పత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగులందరూ పూర్తి వివరాలు అందించి హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్టుకు సహకరించాలని రమేశ్ కోరారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. హెచ్ఆర్ఎంఎస్ దరఖాస్తులో ఉద్యోగి పుట్టిన ఊరు, సర్వీసులో చేరిన మొదటి ప్రాంతం, ఏయే సంవత్సరంలో పదోన్నతులు పొందా రు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తులోని వివరాలు ఆరోగ్యకార్డుల జారీకి కూడా ఉపయోగపడతాయని రమేశ్ తెలిపారు. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు వివరాలు ఇచ్చిన వారు మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమకు ఎన్ని సెలవులు ఉన్నాయి, ఎప్పుడు పదోన్నతి లభిస్తుంది, ఎప్పుడు ఇంక్రిమెంట్లు వస్తాయి వంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చన్నారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఎంఎస్ దరఖాస్తులు ఇచ్చే గడువును ఈనెల 28 వరకూ పొడిగించారు. ఉద్యోగులు భర్తీ చేసిన దరఖాస్తులను డిసెంబర్ 30లోగా తిరిగి అందజేయాల్సి ఉంటుంది. వీటిని జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆన్‌లైన్‌లో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి పైలట్ ప్రాజెక్టుగా నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్, చిత్తూరు జిల్లాలను ఎంపి క చేశారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు రమేశ్ తెలిపారు. డిజిటల్ సర్వీస్ రిజిస్టర్‌ను ప్రతి ఉద్యోగి కూడా ఎప్పటికప్పుడు చూసుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల కేంద్ర సమాచార వ్య వస్థ ఏర్పడుతుందని... ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత పెన్షనర్ల నుంచి కూడా వివరాలు సేకరిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే ఉద్యోగు ల నుంచి వివరాలు కోరుతున్నారని కొంత మంది ఉద్యోగులు చేస్తున్న వ్యాఖ్యలను విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా... అన్నింటికీ ఉపయోగపడతాయని చెప్పారు.