న్యూ ఢిల్లీ, డిసెంబర్ 24: కాంగ్రెస్ పార్టీ తమ ప్రత్యర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఢిల్లీలో దీర్ఘకాలంగా అధికారంలో ఉంటూ ఇటీవలి ఎన్నికలలో అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమైన ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తారా అని పార్టీలో కొందరు సీనియర్లు అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనార్దన్ త్రివేది వెల్లడించారు.
జనార్దన్ త్రివేది మంగళవారంనాడు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రత్యర్థికే మద్దతు ప్రకటించడాన్ని పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోతున్న మాట వాస్తవమని, అయితే పార్టీ నిర్ణయాన్ని అందరూ శిరసావహించవలసిందేనని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసిందని గుర్తు చేస్తూ ఆ వాగ్దానాలను నెరవేర్చవలసిన బాధ్యత ఆ పార్టీపై ఉందని ఆయన అన్నారు. ఏది ఏమైనా తమ పార్టీ భవిష్యత్ నాయకుడు రాహుల్ గాంధీయేనని ఆయన వ్యాఖ్యానించారు.