న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఢిల్లీవాసుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్న సభలు తుది దశకు చేరుకున్నాయి. 'ఇప్పటి వరకు పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అత్యధికశాతం ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా పలు నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. అన్నిటినీ పూర్తి చేసి సోమవారం తుది నిర్ణయం తీసుకుంటాం.' అని ఏఏపీ నాయకుడు మనీష్ సిసోడియా వెల్లడించారు. మరోవైపు ఎస్ఎంఎస్‌లు, పార్టీ వెబ్‌సైట్ ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.
ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేస్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని చెప్పడానికి సోమవారం వరకు లెఫ్టినెంట్ గవర్నర్‌ను గడువు కోరిన విషయం విదితమే. మరోవైపు ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అరవిందర్ లౌవ్లీ ఏఏపీ తీరుపై ధ్వజమెత్తారు. 'మేం మద్దతు ఇస్తామని చెబుతున్నా , వారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు.' అని విమర్శించారు. అదే సమయంలో ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమైన బీజేపీ సైతం ఏఏపీ తీరును ఎండగడుతోంది. 'మేం మొదటి నుంచి చెబుతున్నట్లు కాంగ్రెస్ బి టీమే ఏఏపీ అన్న ఆరోపణలకు బలం చేకూరింది.' అని ఆ పార్టీ నేత హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు.