తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, బిల్లు అభిప్రాయసేకరణకు శాసనసభలో ప్రవేశపెట్టడంతో పాటు మరో పక్క ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గణనీయమైన విజయాలను నమోదు చేసుకోవడంతో రాష్ట్ర బిజెపిలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ పేరును చాలా ముందుగానే ప్రకటించడంతో బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఓట్లను రాబట్టుకోవడం ద్వారా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ బిజెపికి 2013 చారిత్రాత్మక సంవత్సరంగానే నేతలు భావిస్తున్నారు. తెలంగాణ జాక్ పిలుపు మేరకు సడక్ బంద్ నిర్వహించడంలో పెద్ద ఎత్తున బిజెపి నేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 21న దిల్‌షుక్‌నగర్ బాంబుపేలుళ్ల ఘటన, విద్యుత్ చార్జీలపై ఉద్యమం, ఓటర్ల జాబితా సవరణ ఉద్యమం, వికలాంగుల సదస్సు, పత్తి రైతుల సమస్యలపైనా, చేనేత కార్మికుల సమస్యలపైనా ఉద్యమించడం, త్రిచక్రవాహనాలను వికలాంగులకు అందజేయడం, విద్యుత్‌ఛార్జీలపై నాలుగు రోజుల నిరవధిక పోరు దీక్ష, బిజెపి ఆవిర్భావ దినోత్సవం, విద్యుత్ ఛార్జీలు, సర్ చార్జీలపై బంద్ నిర్వహించడంతో పాటు కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లాలకు ఇనుపఖనిజాన్ని తరలించిన విధానంపైనా బిజెపి నిలదీసింది. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించడానికి వ్యతిరేకంగా కూడా బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు నిరసనగా ఏప్రిల్ 23న ఛలో రాజ్‌భవన్ నిర్వహించారు. దేశంలో సంక్షోభానికి కారణమైన ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనకు జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ మే 4, 5 తేదీల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కిషన్‌రెడ్డి మరోమారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, కొత్తగా ఆఫీస్ బేరర్ల జాబితాను ప్రకటించడం కూడా ఈ ఏడాది బిజెపికి కలిసొచ్చింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు పెద్దఎత్తున జరుగుతున్నా మహిళా కమిషన్‌ను పునరుద్ధరించలేదని బిజెపి రాష్ట్ర స్థాయి ఉద్యమాలనే చేసింది. మరోపక్క తెలంగాణ ఉద్యమానికి సంబంధించి టిఆర్‌ఎస్ పార్టీపరంగా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ పేటెంట్ టిఆర్‌ఎస్‌కు మాత్రమే లేదనే పేరిట ఉద్యమాలను చేసింది. గంగోత్రి, యమునోత్రిలో చిక్కుకున్న ప్రయాణికుల వివరాలను కూడా సేకరించి, వారిని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో బిజెపి విజయం సాధించింది. గ్రామాల్లో పార్టీ పరిస్థితిని పటిష్టపరుచుకునేందుకు పల్లెబాట కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించింది. తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్శిటీ ఏర్పాటుపైనా, సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణం పైనా జనాన్ని సమీకరించడంలోనూ, చైతన్య పరచడంలోనూ బిజెపి విజయం సాధించింది. నరేంద్రమోడీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పిలిపించుకుని భారీ బహిరంగ సభను నిర్వహించి బిజెపి సత్తాను చాటింది. ఖరీఫ్ పంట నష్టాలపైనా, తుఫాన్లు, వరదల నష్టాలపైనా ప్రధానికి లేఖలు రాయడమేగాక, నేరుగా ఒక బృందం గత నెల ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేసింది. ఫిబ్రవరిలో భారతీయ మజ్దూర్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జి కృష్ణమూర్తి అధ్యక్షతన పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. సీమాంధ్ర ప్రజల ఇబ్బందులను, సమస్యలను పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకురావడంలో కూడా గట్టి ప్రయత్నమే జరిగింది. అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుంటోందని బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేయగలిగింది. ఒక దశలో రాయల తెలంగాణ అని, మరో సారి పది జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వంటి గందరగోళంతో కూడిన ప్రకటనలు కేంద్రం నుండి వస్తున్నపుడు పార్టీ సంయమనంతో ముందుకు పోయి, తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎలాంటి అయోమయం లేదని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే సరేసరి, లేకుంటే బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పాటు చేయడం తథ్యమని జాతీయ నాయకులతో చెప్పించడంలో రాష్ట్ర నాయకత్వం విజయం సాధించింది. పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, ఎస్వీ శేషగిరిరావు, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, అధికార ప్రతినిధులు ఎన్ రామచంద్రరావు, ప్రకాష్‌రెడ్డి, కుమార్ తదితరులు ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు గట్టి ప్రయత్నం చేశారు. ఎస్సీ మోర్చ, యువమోర్చ, కిసాన్‌మోర్చ, మహిళా మోర్చ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటైన పక్షంలో సీట్లను 153కు పెంచాలని మర్రి శశిధరరెడ్డి చేసిన డిమాండ్‌ను సైతం సకాలంలో తిప్పికొట్టడంలో బిజెపి నేతలు ముందున్నారు.
25, డిసెంబర్ 2013, బుధవారండిసెంబర్ 25, 2013
బిజెపిలో ఉత్సాహం
By Fun Counter
25, డిసెంబర్ 2013, బుధవారం