Recent Posts

త్రీడిలో మహాభారతం, షోలే

22, డిసెంబర్ 2013, ఆదివారం

మన చరిత్రలో, సంస్కృతిలో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని.. అధునిక హంగుల్ని జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు త్రీడీ టెక్నాలజీతో మహాభారతాన్ని యానిమేషన్ చిత్రంగా రూపొందించారు త్రీడీటెక్నాలజీ, యానిమేషన్‌తోపాటు బాలీవుడ్ అగ్రతారలను కూడా రంగంలోకి దించారు. 

 

 భీష్మ పితామహుడి పాత్రకు సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, శ్రీకృష్ణుని పాత్రకు శతృఘ్న సిన్హా, భీమునికి సన్నీ డియోల్, అర్జునునికి అజయ్ దేవగన్, కర్ణునికి అనిల్ కపూర్, ఆదిశక్తి దుర్గకు మాధురీ దీక్షిత్, ద్రౌపదికి విద్యాబాలన్, శకునికి అనుపమ్ ఖేర్, ధర్మరాజుకి మనోజ్ బాజ్‌పేయ్, కుంతికి దీప్తి నావల్, ధుర్యోధనునికి జాకీ ష్రాఫ్‌లు డబ్బింగ్ చెప్పారు. తన 44 ఏళ్ల కెరీర్‌లో అమితాబ్ ఓ యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. అనిల్ కపూర్ 15 రోజులు, మనోజ్ బాజ్‌పేయ్ నాలుగు రోజులు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ నెల 27'మహాభారత్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

'షోలే' మాయాజాలం:

1975లో 'షోలే' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మీడియా ప్రభావం అంతగా లేని ఆ రోజుల్లోనే 'షోలే' పేరు చిన్న చిన్న పల్లెటూళ్లలో కూడా మార్మోగిపోయింది. ముఖ్యంగా 'గబ్బర్‌సింగ్' ఊతపదం 'అరె ఓ సాంబా' అందరి నాలుకలపై బాగా నానింది.  జీపీ సిప్పి నిర్మాణ సారథ్యంలో రమేశ్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వీరుగా ధర్మేంద్ర, జై పాత్రలో అమితాబ్ బచ్చన్‌లు నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా సంజీవ్ కపూర్ నటించారు. హేమమాలిని, జయబాధురి తమ నటనతో ఆలరించారు. 2002లో బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో షోలే టాప్ టెన్ భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 

 

 భారతీయ సినిమా చరిత్రలో 'షోలే' ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈకాలపు ప్రేక్షకులను మరోసారి త్రీడీలో 'గబ్బర్‌సింగ్' ద్వారా భయపెట్టేందుకు దర్శకుడు కేతన్ మెహతా తన సంస్థ మాయా డిజిటల్ ద్వారా ఓ ప్రయోగం చేస్తున్నారు. సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 350 మంది సాంకేతిక నిపుణులతో 'షోలే' చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చారు. సరికొత్త టెక్నాలజీతో, గత కాలపు మధురస్మృతులను మరోసారి నెమరు వేసుకోవడానికి 'షోలే' చిత్రం జనవరి 3న విడుదల కానుంది.

 

వినోదం - తాజా - Google వార్తలు