చెన్నై, నవంబర్ 6: అంగారకుడిని శోధించడానికి ప్రయోగించిన ఉపగ్రహం 'మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)' పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. భూ స్థిర కక్ష్యలో ఉన్న ఈ ఉపగ్రహాన్ని గురువారం ఉదయం మరికొంత ఎత్తుకు చేర్చనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం తొలి పరిభ్రమణంలో ఉన్న మార్స్ ఆర్బిటర్ ఈ నెలాఖరుకల్లా భూమి చుట్టూ ఐదు సార్లు తిరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత సూర్యానువర్తిత కక్ష్యలోకి మారి సూర్యుడి చుట్టూ తిరుగుతూ క్రమంగా అంగారక కక్ష్యలోకి ఉపగ్రహం చేరుతుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి మంగళవారం పీఎస్ఎల్‌వీ-సీ25 రాకెట్‌తో దీన్ని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీంతో భూ కక్ష్యను చేరిన ఉపగ్రహం పనితీరును బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఐఎస్‌టీఆర్ఏసీ) నిరంతరం పర్యవేక్షిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు మార్స్ ఆర్బిటర్ ఆఫ్రికా ఖండంపై ఉంది. నైజీరియా ప్రాంతాన్ని దాటి చాద్ మీదుగా పయనిస్తున్నట్లు శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థద్వారా తెలిసింది. అయితే ఈ ఉపగ్రహం భారత్ మీదుగా వెళ్లదని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికాను దాటుకుని హిందూ మహాసముద్రం మీదుగా కక్ష్యలో పయనిస్తుందని వివరించారు.
కక్ష్య మారేదిలా...
మార్స్ ఆర్బిటర్ ఉపగ్రహం ఎత్తును క్రమంగా పెంచుతూ కక్ష్యను మార్చుతూ వెళతారు. ఇలా భూ ఆవరణాన్ని దాటిన తర్వాత అంగారక గ్రహం వైపు 300 రోజుల పయనం మొదలవుతుంది. ఇందులో భాగంగానే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:17గంటలకు ఉపగ్రహాన్ని మరింత పైకి తీసుకెళతారు. ఇందు కోసం అందులోని ఇంధనాన్ని సుమారు 200 సెకన్లపాటు మండిస్తారు. దీంతో ప్రస్తుతం 23,566 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్య నుంచి దాదాపు 28,785 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఉపగ్రహం చేరుకుంటుందని మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.అరుణన్ తెలిపారు.
ఈ క్రమంలో ఉపగ్రహంలోని సుమారు 40కిలోల ఇంధనం మండిపోతుందని అంచనా. ఇలా ఐదు సార్లు(ఈ నెల 7, 10, 15, 30 తేదీల్లో) ఉపగ్రహం ఉన్న ఎత్తును పెంచనున్నారు. ఆరోసారి దాన్ని అంగారకుడి వైపు మళ్లిస్తారు. 1340 కిలోల మార్స్ ఆర్బిటర్‌లో ప్రస్తుతం 852 కిలోల ఇంధనం ఉంది. ఈ ఆరు యత్నాల్లో దాదాపు 360 కిలోల ఇంధనం వినియోగమవుతుంది. వచ్చే సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి చేరిన తర్వాత ఆరు నెలల పాటు పనిచేసేలా ఉపగ్రహాన్ని తీర్చిదిద్దారు. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులనుపై దీని జీవితకాలం ఆధారపడి ఉంటుంది. కక్ష్యలో ఇంధనం చాలా తక్కువగా అవసరమవుతుంది. ఆరు నెలలకు కేవలం రెండు కిలోలు సరిపోతుంది. అందుకే వాతావరణం అనుకూలిస్తే మార్స్ ఆర్బిటర్ కూడా మరింత ఎక్కువ కాలం పనిచేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్యూరియాసిటీ చేయలేనిది..దాదాపు రూ.15వేల కోట్లు ఖర్చు పెట్టి అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్ చేయలేని పనిని.. రూ.450 కోట్లతో ఇస్రో పంపుతున్న మార్స్ ఆర్బిటర్ చేయనుంది! జీవం ఉనికిని చాటే మీథేన్ వాయువును ఇస్రో ఉపగ్రహం గుర్తిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంగారకుడిపై దిగిన క్యూరియాసిటీ అక్కడ మీథేన్ ఉనికి లేదని ఇప్పటికే తేల్చింది. అయితే ఆ రోవర్ అనుసరించిన విధానంలో అంగారకుడి ఉపరితలమంతా పరీక్షించినట్లు కాదని నిపుణులు అంటున్నారు. "క్యూరియాసిటీ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. అది చెప్పిందే తుది ఫలితం కాదు. గ్రహమంతటినీ అది పరీక్షించలేదు. అయితే మార్స్ ఆర్బిటర్ ఆ పని చేయగలదు. దానిలోని మీథేన్ సెన్సర్ అరుణ గ్రహం ఉపరితలంపై మీథేన్ వాయువు ఎక్కడ ఎక్కువ స్థాయిలో ఉందో గుర్తిస్తుంది. ఇది అత్యంత ప్రధానమైన అంశం. దీనికోసమే ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది'' అని మీథేన్ సెన్సర్‌ను అభివృద్ధిపరిచిన ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్ వివరించారు.