Recent Posts

లోక్‌సభ నిరవధిక వాయిదా

20, డిసెంబర్ 2013, శుక్రవారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కేంద్ర మంత్రివర్గంపై ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తూ సీమాంధ్ర ఎంపీలు సృష్టించిన హంగామా మూలంగా లోక్‌సభ గడువుకు రెండు రోజుల ముందే నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 తేదీ ప్రారంభం కాగా సీమాంధ్ర ఎంపీలు 10నుండి ప్రతిరోజూ కేంద్ర మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తూ లోక్‌సభ కార్యక్రమాలను స్తంభింపజేశారు. సీమాంధ్ర ఎంపీలు బుధవారం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును యాభై మంది ఎంపీలు బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుసుకున్న సంకీర్ణ ప్రభుత్వాధినేతలు అది పరిశీలనకు రాకుండా చూసేందుకు టి. కాంగ్రెస్ ఎంపిలను రంగంలోకి దించారు. టి. కాంగ్రెస్ ఎంపీలు ముందు వరుసలో నిలబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును సభలో ప్రతిపాదించాలంటూ నినాదాలు ఇస్తూ కార్యక్రమాలకు అడ్డుతగిలారు.
సీమాంధ్ర ఎంపీల నోటీసును యాభై మంది ప్రతిపక్ష ఎంపీలు బలపరుస్తారని గ్రహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ టి. ఎంపి పొన్నం ప్రభాకర్‌ను పిలిచి ఏదో చెప్పారు. కమల్‌నాథ్ సూచనలు ఇచ్చిన కొద్దిసేపటికే స్పీకర్ మీరాకుమార్ సీమాంధ్ర ఎంపీలు సబ్బం హరి, నారాయణ రావులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుల గురించి ప్రస్తావించారు. నోటీసులను పరిశీలించేందుకు సభ ఆర్డర్‌లో ఉండాలి, సభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని ఆదేశించారు. స్పీకర్ ఈ సూచనలు ఇస్తుండగానే టి. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్య, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షేట్కర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోడియం వద్దకు వచ్చి తెలంగాణ బిల్లు పెట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. తమ సీట్లలో నిలబడిన సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్ స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాతుతూ సభ ఆర్డర్‌లో ఉన్నందున తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే మీరాకుమార్ మాత్రం సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలనకు చేపట్టలేనని స్పష్టం చేస్తూ లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభించారు. దీనితో పోడియం వద్ద ఉన్న టి. ఎంపీలు సీట్లలోకి వెళ్లారు. దీనితో ఆగ్రహించిన సీమాంధ్ర ఎంపీలు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు సభ ఆర్డర్‌లో ఉన్నా అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు చేపట్టటం లేదంటూ స్పీకర్‌తో వాదనకు దిగారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, ఎం.వేణుగోపాల్‌రెడ్డి, వైకాపా సభ్యులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మేకపారి రాజమోహన్ రెడ్డి, ఎస్‌పివై రెడ్డి కూడా పోడియం వద్దకు దూసుకు వచ్చి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. అయితే మీరాకుమార్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభించారు.
లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరిగిన గంట సేపూ సీమాంధ్రకు చెందిన పదకొండు మంది సభ్యులు గొంతు చించుకుని నినాదాలు ఇస్తూనే ఉన్నారు. ఒక దశలో వారు స్పీకర్ ముందుండే బల్లను గుద్దుతూ నినాదాలు ఇచ్చారు. మరోవైపు సాయి ప్రతాప్, కనుమూరి బాపిరాజు తమ సీట్లలో నిలబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సీమాంధ్ర ఎంపీల నినాదాల జోరు,హోరు మధ్యనే స్పీకర్ లోక్‌పాల్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించిన అనంతరం అమెరికాలో భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాదేకు జరిగిన అవమానాన్ని నిరసించే తీర్మానాన్ని చర్చకు చేపట్టారు. ఈ తీర్మానంపై పలువురు వక్తలు ప్రసంగించినంత సేపు సీమాంధ్ర ఎంపీలు పోడియం వద్ద నిలబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూనే ఉన్నారు. అమెరికా ప్రభుత్వం తీరును సభ తీవ్రంగా ఖండించిన అనంతరం స్పీకర్ లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు.

వినోదం - తాజా - Google వార్తలు