న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాష్ట్రాల పార్టీ విభాగాలను
ప్రక్షాళనం చేయడానికి నడుం బిగించిన కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొత్త పిసిసి అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ పిసిసి అధ్యక్షుడిగా అరవింద్ సింగ్ లలీని, చత్తీస్‌గఢ్ పిసిసి అధ్యక్షుడిగా భూపేష్ భాగెల్‌ను నియమించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జెపి అగర్వాల్ స్థానంలో రాష్ట్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే లలీని నియమించారు. 46 ఏళ్ల లలీ 1987 నుంచి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడమే కాక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 1990లో ఆయన ఢిల్లీ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2003లో షీలాదీక్షిత్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన ఆయన రవాణా, విద్య, రెవిన్యూ లాంటి పలు కీలక శాఖలను నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర పార్టీ విభాగం తనకు ఆశించినంత తోడ్పాటునందించలేదని షీలా దీక్షిత్ ఆరోపించిన తర్వాత అగర్వాల్ తన పదవికి రాజీనామా చేసారు. కాగా చత్తీస్‌గఢ్ పిసిసి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చరణ్‌దాస్ మహంత నేతృత్వంలో పార్టీ ప్రోగ్రామ్ కోర్డినేటర్‌గా పని చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కూడా అయిన బాఘెల్‌ను మహంత స్థానంలో పిసిసి అధ్యక్షుడిగా నియమించింది.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీరి నియామకాలను తక్షణం అమలులోకి వస్తాయని తెలిపారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది చెప్పారు. గత మే నెలాఖరులో జరిగిన మావోయిస్టుల దాడిలో అప్పటి పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్‌సహా పలువురు పార్టీ నాయకులు హతమైన వారం రోజులకు మహంతను తాత్కాలిక పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, మహంతకు మధ్య సత్సంబంధాలు లేక పోవడంతో వీరిద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి పార్టీ ఢిల్లీలో విందు దౌత్యం కూడా నెరపాల్సి వచ్చింది. వీరి మధ్య విభేదాల కారణంగానే పార్టీ పరిస్థితులు చేయి దాటి పోకుండా చూడడానికి పార్టీ సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరాను రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించాల్సి వచ్చింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోరాటం జరపడానికి వీలుగా పార్టీలో సంస్థాగతంగా జరిపే మార్పులకు ఈ నియామకాలు నాందిగా చెప్పవచ్చు. బుధవారం గోవా పిసిసి అధ్యక్షుడు సుభాష్ ఎ శిరోద్కర్‌ను తొలగించి ఆయన స్థానంలో మాజీ ఎంపి జాన్ ఫెర్నాండెజ్‌ను నియమించింది. కాగా, హర్యానా పిసిసి అధ్యక్షుడు ఫూల్‌చంద్ ములానా స్థానంలో పార్టీ ఎంపి, యువ నాయకుడు అశోక్ తన్వార్‌ను కొత్త పిసిసి అధ్యక్షుడిగా నియమించవచ్చనే వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కొంతమంది పార్టీ ఆఫీసు బేరర్లను కూడా తొలగించవచ్చని, కొంతమంది కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ సహా ఒకట్రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మార్చవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
21, డిసెంబర్ 2013, శనివారండిసెంబర్ 21, 2013
ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లకు పిసిసి అధ్యక్షుల నియామకం
By Fun Counter
21, డిసెంబర్ 2013, శనివారం