Recent Posts

వృత్తి విద్యా కోర్సుల వెబ్ కౌన్సిలింగ్ లో సంస్కరణలు

22, డిసెంబర్ 2013, ఆదివారం

హైదరాబాద్, డిసెంబర్ 21: ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల కోసం ప్రస్తుతం అనుసరిస్తోన్న వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ విధానాన్ని ఇకపైనా కొనసాగించటమే మంచిదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అడ్మిషన్లలో సమయం ఆదా కావటం, అత్యున్నత టెక్నాలజీ వినియోగమే ఇందుకు కారణమని తేల్చింది. ప్రస్తుత కౌన్సెలింగ్ విధానంలో అభ్యర్థులకు ఇస్తున్న స్క్రాచ్ కార్డులను కొందరు బ్రోకర్లు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఉన్నత విద్యా మండలి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. శనివారం హైదరాబాద్‌లో మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన నిపుణుల కమిటీ... ప్రస్తుతం అమల్లో ఉన్న వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని సంస్కరించేందుకు ఏడు సిఫారసులు చేసింది. ఇప్పటి వరకు అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాగానే ఇంటి నుంచి, లేదా దగ్గరలోని ఇంటర్నెట్ కేఫ్ నుంచి వెబ్‌లో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంది.

కానీ, ఈ సిఫారసుల ప్రకారం అలాంటి అవకాశం ఉండదు. ఫలితంగా అభ్యర్థులకు రిస్క్ పెరుగుతుంది. కొందరు బ్రోకర్లు స్క్రాచ్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో మిగిలిన అభ్యర్థులకు ఉన్న వెసులుబాటును ఎత్తేయటం మరిన్ని సమస్యలకు దారితీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి నుంచి లేదా సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్ల నుంచి ఆప్షన్లు ఇచ్చుకునే వెసులు బాటు లేకుంటే రాష్ట్రంలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. అయితే కమిటీ ఈ కోణంలో ఆలోచించక పోవటం గమనార్హం. ఈ విషయమై మండలి ఛైర్మన్‌ను ప్రశ్నించగా... స్క్రాచ్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇప్పటికే ఓ కమిటీ పలు సిఫారసులు చేసిందని, ఈ రెండు నివేదికలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

నిపుణుల కమిటీ సిఫారసులు
ఇప్పుడు ఉన్న హెల్ప్ సెంటర్లలో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలేజీ, బ్రాంచ్ ఆప్షన్ల ఎక్స్‌ర్‌సైజింగ్ ప్రక్రియను ఒకే రోజు అభ్యర్థి పూర్తి చేసుకునేలా చూడాలి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరవాత ఆప్షన్ల ఎక్స్‌ర్‌సైజ్‌కు ముందు అభ్యర్థులకు స్క్రాచ్ కార్డ్ ఇవ్వాలి. అలాగే అభ్యర్థి అదే రోజు కాలేజీ, బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోవాలి.

అభ్యర్థి కాలేజీ, బ్రాంచీలను ఎంపిక చేసుకున్న తర్వాత డూప్లికేట్‌లో హార్డ్ కాపీని జనరేట్ చేయాలి. స్టూడెంట్, అధికారి వాటిపై సంతకం చేయాలి. సదరు కాపీని అభ్యర్థికి అప్పటికప్పుడే ఇవ్వాలి.
స్టూడెంట్‌తో పాటు అతని తల్లిదండ్రులు లేదా గార్డియన్ వెంట వెళ్ళేందుకు అనుమతివ్వాలి. ఆప్షన్ల ఎంపిక సమయంలో వారు ఉండేలా చూడాలి. అందుకోసం తల్లిదండ్రులు/గార్డియన్ ఫొటో ఐడెంటిటీతో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
ఆప్షన్లలో మార్పునకు మళ్ళీ ప్రత్యేకించి ఒక రోజును అదే హెల్ప్‌లైన్ సెంటర్లో కేటాయించాలి.
అత్యున్నత కాన్ఫిగరేషన్‌తో పనిచేసేలా అభ్యర్థులకు తగ్గట్టు గా కంప్యూటర్లను ఇప్పుడున్న హెల్ప్‌లైన్ సెంటర్లలో ఏర్పాటు చేయాలి.
ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌గా ఉంది. ప్రతి హెల్ప్‌లైన్ సెంటర్లో దాన్ని 10 ఎంబీపీఎస్‌గా మార్చాలి.

 

వినోదం - తాజా - Google వార్తలు