Recent Posts

ఎన్నికల ప్రక్రియకు మార్చిలో శ్రీకారం

15, డిసెంబర్ 2013, ఆదివారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఎన్నికలకు ఆరు నెలల ముందే జాతీయ ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించింది. 'ఓటు' వివరం ప్రకటించింది. ఈసారి బహుళ దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు జాతీయ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ వెల్లడించారు. పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించకపోయినా..543 మందిని ఎన్నుకునే 16వ జాతీయ ఎన్నికల ప్రక్రియకు మార్చి నెల మధ్యలో శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పుకొచ్చారు.  అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. శనివారం బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో  పాల్గొన్నారు. అమెరికా-భారత్ వ్యాపార మండలి, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి.  ఐదు,ఆరు లేక ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుందని, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. "మరో నెల రోజుల్లో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో 78 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం ఎనిమిది లక్షల పోలింగ్ స్టేషన్లు, 10 లక్షలకు పైగా ఈవీఎమ్‌లు సిద్ధం చేస్తున్నాం. పోలింగ్‌కు ఆరు వారాల ముందు ఎన్నికల ప్రకటనను, మూడు వారాల ముందు నోటిఫికేషన్‌ను జారీ చేస్తాం. ప్రకటన వెలువడిన మరుక్షణంలోనే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వస్తుంది''అని వివరించారు. నిర్ణీత గడువులోపే భారత్‌లో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
ప్రస్తుత పార్లమెంటు గడువు మే 31న ముగుస్తున్నదని, కాబట్టి ఆ లోపే ఎన్నికల క్రమాన్నంతా పూర్తి చేసి.. జూన్ ఒకటో తేదీన కొత్త సభ కొలువుతీరేలా చూడటం ఎన్నికల సంఘం విధి అని వివరించారు. శాంతిభద్రతలు, పోలింగ్ స్టేషన్ల పరిస్థితి, ఎన్నికల పరికరాలు, వనరులు, సిబ్బంది, సాధనాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ఏర్పాట్లు జరగుతాయని  చెప్పారు.

వినోదం - తాజా - Google వార్తలు