విజయవాడ, డిసెంబర్ 22 : ఇంద్రకీలాద్రి కనకదుర్గ గుడి మహా మండపం వద్ద, దేవస్థానం వసతి సముదాయంలోని ఓ క్వార్టర్స్‌లో అదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండడంతో నివాసితులు భయభ్రాంతులు చెందుతూ రోడ్డుపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి, ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ భక్తులు భవానీలు చేపట్టిన మండల, ఆర్ధమండల దీక్షలను విరమించేందుకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు దీక్షల విరమణకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం, దేవాదాయశాఖ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.
స్నాన ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చెప్పులు, సామాన్లు భద్రపరచటం, వైద్య శిబిరాల ఏర్పాటు, పారిశుధ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకుల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. భక్తులకు విక్రయించేందుకు తొలిరోజు నుంచి అవసరమైన మేరకు లడ్డుల ప్రసాదాన్ని సిద్ధం చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు జరిగాయి. భక్తులు ఇరుముడులు సమర్పించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.