Recent Posts

కిరణ్‌కు ఢిల్లీ పిలుపు!

24, డిసెంబర్ 2013, మంగళవారం

హైదరాబాద్ :శుక్రవారం సమన్వయ కమిటీ భేటీ! అదే రోజు కోర్ కమిటీ భేటీ! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఢిల్లీ పిలుపు! సీఎంగా కిరణ్‌కు ఇదే చివరి పర్యటనా!? కిరణ్‌తో చివరిసారి మాట్లాడి నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోందా!? ఆయన ససేమిరా అంటే 'ప్లాన్ బి'తో రెడీగా ఉందా!? ఈ ప్రశ్నలకు 'ఔను' అనే సమాధానమిస్తున్నాయి ఢిల్లీ వర్గాలు! రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనతో చివరిసారి మాట్లాడి నచ్చజెప్పేందుకు అధిష్ఠానం ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించబోనని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే ఏం చేయాలన్న విషయంలో కూడా అధిష్ఠానం ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. విభజనకు సహకరించకపోతే అసెంబ్లీ సమావేశాల వరకూ కిరణ్‌ను కొనసాగించరాదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని ఈ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్‌ను ఢిల్లీ పిలిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం ఢిల్లీలో జరిగే సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కావాలంటూ ముఖ్యమంత్రికి దిగ్విజయ్ కబురు పెట్టారు.

 

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్ సింగ్ బాధ్యతలు చేపట్టాక సమన్వయ కమిటీని పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. కమిటీకి చైర్మన్‌గా దిగ్విజయ్, కన్వీనర్‌గా బొత్స సత్యనారాయణ, సభ్యులుగా సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనరసింహ, కేంద్ర మంత్రి చిరంజీవి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు తిరునావక్కరుసు, కుంతియా ఉన్నారు. నెల రోజుల కిందటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని దిగ్విజయ్ భావించారు. ఫైలిన్ తుఫాను, భారీ వర్షాలు తదితర కారణాలతో దీనిని రద్దు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. డిగ్గీ రాజా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఇందులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం సత్తిబాబు ఢిల్లీ వెళ్లనుండగా.. శుక్రవారం ఉదయం సీఎం కిరణ్ వెళుతున్నారు. సమన్వయ కమిటీలో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితినే చర్చిస్తారని, వేరుగా అజెండా ఏమీ లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కానీ, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన షెడ్యూలుపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది.

 

పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులను దిగ్విజయ్ అభ్యర్థించవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాను రాష్ట్ర సమైక్యతకే కట్టుబడి ఉంటానని, రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించే ప్రసక్తే లేదని సీఎం కిరణ్ తేల్చి చెబితే.. అధిష్ఠానం సీరియస్‌గా తీసుకోవచ్చునని భావిస్తున్నారు. పదవి నుంచి తప్పుకోవాలంటూ ఆయనకు సూచించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు, కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కూడా శుక్రవారమే జరుగుతోంది. రాష్ట్ర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించవచ్చునని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ధిక్కార ధోరణిపై గవర్నర్ నరసింహన్ ఇప్పటికే నివేదిక సమర్పించారని, సీఎంను ఇక ఎంత మాత్రమూ ఉపేక్షించరాదని సూచించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కిరణ్‌ను ఢిల్లీకి పిలిపించడంలో రాజకీయ ప్రాధాన్యం ఏర్పడిందని వివరించాయి. ఒకవేళ ముఖ్యమంత్రి ఇంకా ధిక్కార ధోరణిని ప్రదర్శించి, సహకరించేందుకు కానీ, రాజీనామా చేసేందుకు గానీ నిరాకరిస్తే ఏం చేయాలన్న విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఈ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కిరణ్ ఢిల్లీకి వచ్చి తమతో మాట్లాడిన తర్వాత ఏ విషయం తేలుతుందని, అంతవరకూ ఏమీ చెప్పలేమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

 

నిజానికి గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రికీ ఢిల్లీ పెద్దలకూ మధ్య సంబంధాలు లేవని, కనీసం ఫోన్ల ద్వారా కూడా సంభాషణలు జరగలేదని తెలుస్తోంది. ఇందుకు సమన్వయ కమిటీ భేటీకి కిరణ్‌కు కబురు పంపడాన్ని ఉదాహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేద్దామని సత్తిబాబును దిగ్విజయ్ అడిగారు. సీఎం కిరణ్ ఎప్పుడు ఢిల్లీ వస్తారో తెలుసుకోవాలని సూచించారు. దీంతో, ముఖ్యమంత్రి కిరణ్‌తో సత్తిబాబు మాట్లాడారు. ఈనెల 9న ప్రధానిని కలిసి వరదల కారణంగా భారీ నష్టం సంభవించిందని, సహాయం చేయాలని కోరనున్నామని, ఎనిమిదిన సమావేశమైతే బాగుంటుందని సత్తిబాబుకు కిరణ్ సూచించారు. ఇదే విషయాన్ని దిగ్విజయ్‌కు సత్తిబాబు చేరవేశారు. కిరణ్ అందుబాటు మేరకే శుక్రవారం సమన్వయ కమిటీ భేటీ నిర్వహించాలని దిగ్విజయ్ నిర్ణయించారు.

 

అంతే తప్ప.. కిరణ్‌తో ఆయన నేరుగా మాట్లాడలేదని తెలుస్తోంది. దీనికితోడు, సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఢిల్లీ వచ్చిన సీఎం దాదాపు 50 రోజులుగా దేశ రాజధాని ముఖం చూడకపోవడం గమనార్హం. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇన్ని రోజులపాటు ఢిల్లీ రాకపోవడం చాలా అరుదైన అంశమని, ఇదే అధిష్ఠానానికీ, సీఎంకు చెడింద నడానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని, సోనియా, హోం మంత్రి షిండే తదితరులను కిరణ్ కలుసుకునే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర సీఎంగా కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే మంత్రి రఘువీరా, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిలతో బుధవారం ఆయన మంతనాలు జరిపారు. దిగ్విజయ్‌తో విందు భేటీ కోసం కర్నూలు నుంచి బుధవారం ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం గమనార్హం.

 

ఢిల్లీ ఏం చెబుతుందో చూద్దాం..

రాష్ట్ర విభజన, సీమాంధ్రకు న్యాయం వంటి అంశాలపై ఢిల్లీ పెద్దలు ఏం చెబుతారో చూద్దామని తనను కలిసిన మంత్రులతో కిరణ్ వ్యాఖ్యానించారు. కొంతమంది మంత్రులు బుధవారం సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చింది. శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నానని, సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటానని కిరణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలకు ఏమైనా చెబుతారా అని మంత్రులు ప్రశ్నించగా.. ఢిల్లీ పెద్దలు ఏం చెబుతారో చూద్దామని కిరణ్ బదులిచ్చారు. తొందరపాటు వద్దని, ఏ నిర్ణయమైనా సమష్టిగానే తీసుకుందామని సూచించారు.

వినోదం - తాజా - Google వార్తలు