Recent Posts

ఇస్లామిక్ వర్శిటీ నిర్మాణాలు తొలగించాలి

21, డిసెంబర్ 2013, శనివారం

తిరుపతి, డిసెంబర్ 19: ఓటు బ్యాంకు రాజకీయాలతో తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చేస్తూ పాలకులు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని, తిరుమల తిరుపతి పవిత్రతా సంరక్షణ వేదిక అధ్యక్షులు,శ్రీకాకుళం శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా మీడియాకు తెలియకుండా 12 మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ వద్ద హీరా సంస్థ అక్రమంగా నిర్మించిన ఇస్లామిక్ ఇంటర్నేషనల్ వర్శిటీ నిర్మాణాలను తొలగించాలని, లేదా తక్షణం ఆ భవనాలను ప్రభుత్వంకాని, టిటిడి కాని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ జాగృతి చైతన్య సదస్సును శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న నేపధ్యంలో శివస్వామి నేతృత్వంలో ప్రచార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి శివస్వామి నేతృత్వంలో వందలాది మంది నగరంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రం ఉగ్రవాదులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళన వ్యక్తం చేశారు. పుత్తూరులో ఉగ్రవాదులను అరెస్టు చేసిన తరువాత తిరుపతి సహా జిల్లా వ్యాప్తంగా 12 మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ విషయం మీడియాకు కూడా పొక్కకుండా జాగ్రత్తపడ్డారన్నారు.
తిరుపతిలోని మసీదుల్లో సుమారు 2 వేల మంది అదనంగా ప్రతి శుక్రవారం నమాజ్‌కు వస్తున్నారన్నారు. వీరంతా ఎక్కడ నుంచి వస్తున్నారు, వారు ఏమి చేస్తున్నారో ముస్లిం సోదరులే జాగ్రతపడాలన్నారు. ముస్లింలు తమ పవిత్రతను, ప్రతిష్టను వారే కాపాడుకోవాలన్నారు. తాము తిరుపతిలో నిర్వహించే సభ ముస్లింలకు వ్యతిరేకంగా కాదన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో చాప కింద నీరులా సాగుతున్న అసాంఘిక వ్యవస్థపైనే అన్నారు. తమ సభకు ముస్లింలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. తిరుమల శేషాచలం అడవుల్లో ఇద్దరు అధికారులను హత్యచేసిన స్మగ్లర్లను పట్టుకోలేని పోలీసులు ఉగ్రవాదులను పట్టుకోగలరా? అని ఆంధ్రా సాధు పరిషత్ అధ్యక్షులు, తిరుమల తిరుపతి సంరక్షణ వేదిక ఉపాధ్యక్షులు శ్రీనివాసానంద యోగి స్వామి అన్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇద్దరు అటవీశాఖ అధికారులను తమిళనాడు నుండి వచ్చిన స్మగ్లర్లు దారుణంగా హత్య చేసి వెళుతుంటే వారిని పట్టుకోవడంలో, స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్న పోలీసులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెట్ వర్క్ కల్గిన ఉగ్రవాదులను పట్టుకోగలరా? అని ప్రశ్నించారు. ఇస్లామిక్ వర్శిటి నిర్మాణాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలిచ్చిందన్నారు. అయినా ఇస్లామిక్ భవంతి కూలకొట్టడంలో అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలను విడనాడి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడాలన్నారు. లేకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం తిరుపతిలో నిర్వహించే సభను అడ్డుకున్నా, అరెస్టు చేసినా, తమకు ఎటువంటి హాని జరిగినా యావత్ హిందూ సమాజం కదిలి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూ జన జాగృతి సమితి రాష్ట్ర అధ్యక్షుడు చైతన్ జనార్థన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల క్రిష్ణకిశోర్, రామాంజనేయులు, భాస్కర్, వెంకటరమణ, ప్రభాకర్ పాల్గొన్నారు.

కూలుస్తారా? కూల్చమంటారా?
హైందవ ధార్మిక క్షేత్రంలో ఒక ప్రయివేటు సంస్థ నిబంధలకు విరుద్ధంగా ఇస్లామిక్ ఇంటర్నేషనల్ యూనివర్శిటిని ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు ఏమి చేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి యూనివర్శిటి అక్రమ నిర్మాణాలను కూల్చకపోతే హైందవ ధర్మాన్ని పరిరక్షించే తామే కూల్చాల్సి వస్తుందని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందస్వామి హెచ్చరించారు. గురువారం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కాలో, క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన వాటికన్ సిటిలో వేదపాఠశాలను,మఠాలను, పీఠాలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించారు. అక్కడ ఆ పరిస్ధితి లేనప్పుడు హైందవ క్షేత్రంలో ఇస్లామిక్ వర్శిటిని ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం ఎంత వరకూ ధర్మమన్నారు. ఇస్లామిక్ వర్శిటి నిర్మాణాలపై కోర్టు అభ్యంతరాలు తెలిపినా, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ అక్రమ కట్టడాలను కూల్చివెయ్యాలని నోటీసులు ఇచ్చినా కూల్చకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని లేకుంటే ఆ పనిని మఠ,పీఠాధిపతులు చేయడానికి పూనుకోవాల్సి వస్తుందన్నారు. మతపరమైన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా సానుకూలంగా వ్యవహరించడం తగదన్నారు. ముస్లిం మహిళలకు విద్యాబోదన చెయాలంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలే కాని ఒక ప్రయివేటు సంస్థ కాదన్నారు. ముస్లిం మహిళలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి సదరు నిర్వాహకులకు ఉంటే వారి మత క్షేత్రాల్లో నిర్మించుకోవాలన్నారు. హైందవ క్షేత్రంలో నిర్మించడానికి ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రభుత్వం కూడా అంగీకరించకూడదన్నారు.



వినోదం - తాజా - Google వార్తలు