Recent Posts

అమెరికా దౌత్య అధికారులకు 'గుర్తింపు' రద్దు

25, డిసెంబర్ 2013, బుధవారం

న్యూఢిల్లీ/వాషింగ్టన్, డిసెంబర్ 24: దేవయాని ఖోబ్రాగడే వ్యవహరంతో అమెరికా, భారత్ మధ్య మొదలైన దౌత్య యుద్ధం కొనసాగుతోంది. అమెరికా చర్యలకు దీటుగా భారత్ ప్రతిస్పందిస్తోంది. భారత్‌లోని అమెరికా దౌత్య అధికారుల దౌత్య హోదాకు కత్తెర వేయాలని, వారి కుటుంబ సభ్యులకు కల్పించిన దౌత్యహోదానూ రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలోని భారత దౌత్యవేత్తలకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోందో.. భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తలకు కూడా అటువంటి సౌకర్యాలనే కల్పించాలని నిర్ణయించింది. అమెరికా దౌత్య అధికారులకు అందజేసిన అన్ని గుర్తింపు కార్డులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని భారత దౌత్యఅధికారులకు ఎటువంటి గుర్తింపు కార్డులనిచ్చారో అటువంటివాటినే జారీ చేయనుంది. వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి కార్డులను ఇవ్వకూడదని కూడా కేంద్రం నిర్ణయించింది.

 

అమెరికాలో భారత దౌత్య అధికారుల కుటుంబ సభ్యులకు కూడా గుర్తింపు కార్డులు లేకపోవడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి మిషన్ శాశ్వత దౌత్యవేత్తగా దేవయాని ఖోబ్రాగడే నియామక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ పత్రాలను ఐక్యరాజ్యసమితి నుంచి శుక్రవారం అర్ధరాత్రి తమకు అందినట్లు తెలిపారు. అయితే పత్రాల పరిశీలనకు ఎంత సమయం పడుతుందనే దానిపై వారు సరైన సమాధానం చెప్పలేదు. మరోవైపు.. దేవయాని ఎల్లప్పుడూ చట్టానికి లోబడే ప్రవర్తిస్తుందని ఆమె సోదరి శర్మిష్ఠ ఖోబ్రాగడే పేర్కొన్నారు. ఆమెకు చట్టంపై చాలా గౌరవముందని చెప్పారు. ఆమెపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమని, దేవయాని అమాయకురాలని స్పష్టం చేశారు

వినోదం - తాజా - Google వార్తలు