హైదరాబాద్, డిసెంబర్ 23: విభజన జరిగితే అప్పులను ఇరు ప్రాంతాలకు ఎలా పంపిణీ చేయాలన్న అంశంపై సందిగ్దత కొనసాగుతోంది. లక్షల కోట్ల రూపాయల అప్పులను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అనుసరించాల్సిన గణనను ఎంపిక చేసుకోవడంలో ఇంకా నిర్ధిష్టమైన నిర్ణయానికి కేంద్రం రాలేకపోయింది. కొన్ని ఆర్ధిక పంపకాల్లో ఇప్పటికీ 1971 జనాభా గణననే ఆధారంగా తీసుకుంటుండగా, ఇప్పుడు 2011 జనాభా గణాంకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేని ఆధారంగా పంపిణీ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్రంపై ప్రస్తుతం 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అందులో కేంద్రం నుంచి మనకు లభించిన అప్పులే అత్యధికంగా 1.26 లక్షల కోట్లు. జైకా, ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు 8.5 వేల కోట్లు. ఇక రాష్ట్రం నేరుగా నాబార్డు, ఎల్‌ఐసి, హడ్కోవంటి సంస్థల నుంచి తీసుకున్న సొంత అప్పులు ఆరు వేల కోట్లు. కార్పొరేషన్లకు, ఆర్ధిక సంస్థలకు ఇచ్చిన ష్యూరిటీల మొత్తం 9.5 కోట్లు. ఇందులో జైకా, ప్రపంచ బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం మినహాయిస్తే మిగిలిన 1.42 లక్షల కోట్ల రూపాయలను జనాభా ప్రాతిపదికనే రెండు రాష్ట్రాలకూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే అతి పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.
వాస్తవంగా కేంద్రం నుంచి వచ్చే ఆర్ధిక సంఘం నిధులను ఇప్పటికీ 1971 జనాభా ప్రాతిపదికనే పంపిణీ చేస్తున్నారు. దాదాపు 42ఏళ్ల క్రితం జనాభానే ప్రాతిపదికగా తీసుకుని నిధుల పంపిణీ చేస్తున్నారు. ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్టాలు మాత్రం స్వాగతిస్తున్నాయి. 1971 జనాభా ప్రాతిపదికను అమలు చేస్తుండటంతో మన రాష్ట్రానికి ప్రతి ఐదేళ్లకు కనీసం ఏడు వేల కోట్ల వరకూ అదనపు నిధులు వస్తున్నాయి. 1971 జనాభా గణన మేరకు మన రాష్ట్ర జనాభా దేశ జనాభాలో ఎనిమిది శాతంగా ఉండగా, తాజా గణాంకాల మేరకు దేశ జనాభాలో మన జనాభా ఏడు శాతంగానే ఉంది. అందుకే 1971 జనాభా గణనను ఆధారంగా చేసుకోవడం వల్ల ఒక శాతం నిధులు ఇతర రాష్ట్రాల కన్నా మనకు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం అప్పుల పంపిణీని ఒకే రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకూ పంపిణీ చేయడానికి పాత ప్రాతిపదికను అమలు చేయడం సాధ్యం కాదని అధికార్లు అంటున్నారు. అందుకే విడిపోయే రాష్ట్రాలకు 2011 జనాభా ప్రాతిపదికను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నారు. అయితే దీనిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక జైకా, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి తీసుకొచ్చిన 8500 కోట్ల రూపాయలతో దాదాపు హైదరాబాద్‌లోనే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించగా, మరికొంత మొత్తాన్ని తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల్లో ఖర్చు చేశారు. దీంతో ఈ మొత్తాన్ని మాత్రం ప్రాజెక్టుల వినియోగం ప్రాతిపదికన పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో 4200 కోట్ల రూపాయలను హైదరాబాద్‌లో, 2900 కోట్లను సీమాంధ్రలో, 1350 కోట్ల రూపాయలను తొమ్మిది జిల్లాల తెలంగాణలో ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
24, డిసెంబర్ 2013, మంగళవారండిసెంబర్ 24, 2013
అప్పుల పంపకాలు ఎలా?
By Fun Counter
24, డిసెంబర్ 2013, మంగళవారం