వాషింగ్టన్, డిసెంబర్ 21 : అమెరికాలో మరో భారతీయ-అమెరికన్ వ్యక్తి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం టెక్సాస్‌లో ప్రముఖ న్యాయవాదిగా ఉన్న నందితా వెంకటేశ్వరన్ బెర్రీ(45) ... టెక్సాస్ రాష్ట్ర 109వ విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. వచ్చే నెల 7న ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. ఆ రాష్ట్రంలో మూడో అత్యున్నతమైన పదవిగా చెప్పే స్థానంలో ఒక భారతీయ-అమెరికన్‌ను నియమించడం ఇదే తొలిసారి. ఈ బాధ్యతలతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా, రాష్ట్ర, అంతర్జాతీయ వ్యవహారాల్లో చీఫ్ ప్రొటోకాల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. దీంతోపాటు సరిహద్దు, మెక్సికో వ్యవహారాల్లో గవర్నర్‌కు అనుసంధానకర్తగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. నందితకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత, తెలివితేటలు, సుదీర్ఘ అనుభవం ఈ కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయని గరవ్నర్ రిక్ పెర్రీ అన్నారు. ప్రజలు జీవించడానికి, ఉపాధి కల్పించడానికి దేశంలోనే టెక్సాస్‌ను అగ్రస్థానంలో ఉంచేలా ఆమెతో కలిసి పని చేయడానికి తాను ఎదురుచూస్తున్నానని పెర్రీ పేర్కొన్నారు. తన ముందు ఈ బాధ్యతలు నిర్వహించిన స్టీఫెన్ ఎఫ్ ఆస్టిన్ అడుగుజాడల్లోనే తాను నడుచుకుంటానని, పనితీరులో స్టీఫెన్ ఎంతో స్ఫూర్తిదాయంగా ఉన్నారని ఈ సందర్భంగా నందిత చెప్పారు. టెక్సాస్ ఒక అవకాశాల గని అని, స్టీఫెన్ మాదిరిగానే తాను కూడా మెరుగైన భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చానని ఆమె చెప్పారు.
హైదరాబాద్‌లో పుట్టి...
నందితా వెంకటేశ్వరన్ బెర్రీ 1968లో హైదరాబాద్‌లో పుట్టారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికా వెళ్లిన తర్వాత హూస్టన్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిటర్ డిగ్రీ పొందారు. 1995లో హూస్టన్ లా సెంటర్ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించిన ఆమె, అదే ఏడాది టెక్సాస్ బార్‌లో చేరారు. 21 ఏళ్ల వయసులో 200 డాలర్లతో అమెరికాలో అడుగుపెట్టిన నందిత... పలు డిగ్రీలు సాధించారు. వివాదాస్పద రేడియో వ్యాఖ్యాత, హూస్టన్ సిటీ కౌన్సిలర్‌ను పెళ్లాడారు. అనతికాలంలోనే ప్రముఖ న్యాయవాదిగా ప్రఖ్యాతిగాంచిన ఆమె... ప్రస్తుతం లాక్ లార్డ్ ఎల్ఎల్‌పీ అనే న్యాయ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద స్వతంత్ర సహజ వాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎల్ పాసో కార్పొరేషన్ అనే సంస్థ కార్పొరేట్, సెక్యూరిటీల విభాగాల్లో న్యాయవాదిగా ఆమె వ్యవహరిస్తున్నారు.