Recent Posts

న్యాయ నిపుణుల సలహాలు గాలికి .....

16, డిసెంబర్ 2013, సోమవారం

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రూపకల్పనలో కేంద్ర మంత్రుల బృందం వివిధ అంశాలపై న్యాయ, లెజిస్లేటివ్ విభాగాలు, న్యాయ నిపుణులు ఇచ్చిన సూచనలను పక్కన పడేసింది. 'అభిప్రాయం చెప్పండి' అని అడిగినట్లే అడిగి... వారిచ్చిన సలహాలను పట్టించుకోకుండా వదిలేసింది. బిల్లు రూపకల్పనలో న్యాయ నిపుణుల అభిప్రాయం చివరకు తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా వున్నాయి.
గవర్నర్‌కు అధికారాలు
ప్రతిపాదన: ఆర్టికల్ 371హెచ్‌ను ఆంధ్రప్రదేశ్ విభజనకు వర్తింపచేయడం. (శాంతి భద్రతలపై పర్యవేక్షణ, నిర్ణయం గవర్నర్‌దే. ఆయా అంశాలపై రాష్ట్ర మంత్రివర్గాన్ని సంప్రదించినా...అంతిమ నిర్ణయం మాత్రం గవర్నర్‌దే.) 
అభిప్రాయం: కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు 1986లో రాష్ట్ర హోదా కల్పించారు. అరుణాచల్‌ప్రదేశ్ భౌగోళికంగా సున్నితమైన ప్రాంతంలో ఉండ టం, ఆ రాష్ట్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 371(హెచ్) అధికరణం తీసుకొచ్చారు. కానీ... అలాంటి ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. అందువల్ల, దీన్ని చేర్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం కావొచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో దీన్ని చేర్చడం కూడా సాధ్యంకాకపోవచ్చు.
నిర్ణయం: ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వలసలు ఉండటమే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందడానికి కారణం. తద్వారా చోటుచేసుకున్న ఆర్థికాభివృద్ధిని కాపాడాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించేందుకు జీహెచ్ఎంసీని ఉమ్మడి రాజధానిగా గుర్తించాం. అలాగే... అంతర్గతంగా భద్రతను కాపాడటం, ప్రజలందరికి రక్షణ, శాంతి భద్రతలు, ప్రభుత్వ వసతి కల్పన వంటి ప్రత్యేక బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించాలని భావిస్తున్నాం.
వివాదం: 371(హెచ్)ను ఆంధ్రప్రదేశ్‌కు వర్తింపచేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదని తేల్చినా... బిల్లులో పట్టించుకోలేదు. రాజ్యాంగ సవరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదు. పైగా...అరుణాచల్ తరహాలోనే ఇక్కడి గవర్నర్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయా అంశాలపై సంప్రదించినప్పటికీ, తుది నిర్ణయం మాత్రం ఆయనదే అని తెలిపారు. రాష్ట్ర జాబితాలోని శాంతిభద్రతల అంశాన్ని రాజ్యాంగాన్ని సవరించకుండానే గవర్నర్‌కు ఎలా అప్పగిస్తారో చెప్పలేదు.
371 (డి)
అంశం: ఆర్టికల్ 371(డి)కి సవరణలు అవసరమా?
న్యాయశాఖ అభిప్రాయం: "ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేశాక ఆర్టికల్ 371(డి) అనేది ఆంధ్రప్రదేశ్‌కు వర్తించదు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం వెనుకబడ్డ ప్రాం తాలు, ప్రత్యేకించి తెలంగాణ జిల్లాల్లోని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించే ఉద్దేశంతోనే 371(డి) అధికరణ తీసుకొచ్చారు. ఆర్టికల్ 371(డి)లో 'అవసరాల రీత్యా రాష్ట్రం మొత్తంగా' అనే పదం ఉపయోగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోతే మిగిలిన ప్రాంతానికి దీన్ని వర్తింపచేయడం సరికాదు. విభజన తర్వాత దీన్ని ఒక ప్రాంతానికి వర్తింపచేయడమేంటే 371(డి) మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడమే'' అని అటార్నీ జనరల్ వాహనవతి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై...లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ విశ్వనాథం కూడా తన అభిప్రాయం చెప్పారు. "ఆర్టికల్ 2, 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించినప్పుడు... ఆ విభజనకు సంబంధించి రాజ్యాంగంలో తగిన మార్పు చేర్పులకు సంబంధించిన 'సవరణ'లు కూడా చేసుకోవచ్చునని ఆర్టికల్-4 చెబుతోంది. అయితే... 371(డి) అనేది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని చేర్చారు. విభజన తర్వాత దీనిని సవరించడమో, పూర్తిగా తొలగించడమో చేయాలి. సాధారణ చట్టాలను చేసేందుకు ఉన్న అధికారంతో పార్లమెంటు దీనిని చేయలేదు. ఆర్టికల్ 378 ప్రకారం రాష్ట్రాల శాసనసభల ఆమోదంతో 371(డి) రాజ్యాంగ సవరణ చేశారు'' అని విశ్వనాథం పేర్కొన్నారు.
వెరసి...తెలంగాణ బిల్లులో ఒక క్లాజ్ చేర్చడం, ఆర్టికల్ 4ను ఉపయోగించడం ద్వారా ఆర్టికల్ 371(డి)ని సవరించలేరు.
బిల్లులో ఏం చెప్పారు: అటార్నీ జనరల్, లెజిస్లేటివ్ విభాగాల అభిప్రాయాలను చదివాం. 32వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు, లక్ష్యాలు, విధానాలను పరిశీలిస్తే సిక్స్‌పాయింట్ ఫార్ములా ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కల్పనలో సమాన అవకాశాలు కల్పించడం దీని ప్రధానమైన లక్ష్యం. దీన్ని కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితం చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆర్టికల్ 371(డి) ప్రయోజనాలు తమకు కల్పించాలన్న డిమాండ్లు తలెత్తుతాయి. అవసరాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని కోరుతారు. కాబట్టి ఆర్టికల్ 371(డి) ఉద్దేశాలను ఇతరులు కూడా అందుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం దాంట్లో తదునుగుణమైన మార్పులు చేయవచ్చు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఆర్టికల్ 371ను సవరించి బాంబే పున ర్ వ్యవస్థీకరణ చట్టం-1960 తీసుకొచ్చి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రాంత చట్టం తీసుకొచ్చినప్పుడు ఆర్టికల్ 371 (బి)ని సవరించారు. 371(డి)కి రాజ్యాంగ సవరణ చేయడం న్యాయపరంగా మరింత బలంగా ఉంటుంది. అయితే, పరిస్థితులన్నీ పరిశీలించిన మీదట, సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యా ంగ సవరణ బదులు ఈ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోనే సవరణ తీసుకురావాలని నిర్ణయించాం. బాంబే పునర్‌వ్యవస్థీకరణ చట్టం చేసిన మాదిరిగానే దీన్ని చేపట్టాలి.
వివాదం: ఆర్టికల్ 371(డి)కి రాజ్యాంగ సవరణ తప్పదని సాక్షాత్తూ అటార్నీ జనరల్ తేల్చి చెప్పారు. 'సవరణ'తో న్యాయపరంగా మరింత బలంగా ఉంటుందని జీవోఎం కూడా అంగీకరించింది. కానీ.. రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం (సౌలభ్యం) లేనందునే మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
శాంతిభద్రతలు
ప్రతిపాదన: జీహెచ్ఎంసీ పరిధిలో శాంతి భద్రతల అధికారాలను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఉంటారు)కు అప్పగించాలి. ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ను కేంద్ర పరిధిలోకి తీసుకురావాలి!
అభిప్రాయం: రాజ్యాంగం ప్రకారం పోలీసు, శాంతి భద్రతలు అనేవి పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అధికారాలు. ఈ అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. "రాష్ట్ర విభజనకు సంబంధించిన అధికారాలు ఆర్టికల్ 2, 3 ద్వారా పార్లమెంటుకు సంక్రమించాయి. అయినప్పటికీ...తగిన బలమైన కారణాలు లేకుండా రాష్ట్రం చేతిలోని న్యాయ, చట్టపరమైన వ్యవస్థలను కేంద్రం రద్దు చేయజాలదు. ఆర్టికల్ 4 అలాంటి అధికారాలను కేంద్రానికి ఇవ్వలేదు'' అని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో తీర్పు చెప్పింది. అందువల్ల... రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించిన అధికారాలను కేంద్రం రద్దుచేయజాలదు.
నిర్ణయం: న్యాయశాఖ అభిప్రాయం మేరకు ఆ ప్రతిపాదనలను విరమించుకుంటున్నాం!
వివాదం: 'జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతలపై సమన్వయ కమిటీ ఏర్పాటు' అనే అంశాన్ని మాత్రమే వదిలేశారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగించారు. ఇది న్యాయశాఖ సిఫారసుకు విరుద్ధమే. అలాగే... గ్రేహౌండ్స్ మూడేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుందంటూనే, ఆ సమయంలో కేంద్ర హోంశాఖ దీనిని పర్యవేక్షిస్తుందని బిల్లులో చెప్పారు. ఇది కూడా న్యాయశాఖ అభిప్రాయానికి విరుద్ధమే.

వినోదం - తాజా - Google వార్తలు