Recent Posts

పబ్లిక్ ఇష్యూకు జిఎంఆర్ ఇన్‌ఫ్రా యోచన

16, డిసెంబర్ 2013, సోమవారం

మౌలికవసతులు, నిర్మాణం, విద్యుత్, విమానాశ్రయాల రంగాల్లో విస్తరించి ఉన్న జిఎంఆర్ ఇన్‌ఫ్రా విమానాశ్రయాల వ్యాపారాన్ని విడదీసి ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేసే ఆలోచనలో ఉంది. ఇందుకోసం సంస్థ పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేయడం ద్వారా కనీసం 30-35 కోట్ల డాలర్లను (1,800 కోట్ల-2,100 కోట్ల రూపాయలు) జిఎంఆర్ సమీకరించే అవకాశం ఉందని, విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇష్యూ సందర్భంగా ప్రమోటర్లతో పాటు తొలిరోజుల్లో పెట్టుబడులు పెట్టిన ఈక్విటీ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించే అవకాశం ఉంది.
సిటీగ్రూప్, జెపి మోర్గాన్, యాక్సిస్ కాపిటల్, ఐడిఎ ఫ్‌సిని ఇష్యూ కోసం మర్చెంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్టు తెలిసింది. పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలను జిఎంఆర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయం కూడా జిఎంఆర్ నిర్వహణలో ఉంది. ఫిలిఫ్పైన్స్‌లోనూ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును జిఎంఆర్ దక్కించుకునే అవకాశాలున్నాయి. మక్టన్-సెబు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో జిఎంఆర్ కన్సార్షియం గెలుపొందే అవకాశముంది.
ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో 40 శాతం వాటా విక్రయం
ఇస్తాంబుల్‌లోని సబీహ గుర్క్‌చెన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని తమ మొత్త 40 శాతం వాటాను జిఎంఆర్ 1,900 కోట్ల రూపాయలకు విక్రయించనున్నట్టుగా తెలిసింది. ఇస్తాంబుల్‌లోనే ఉన్న మరో ప్రధాన ఎయిర్‌పోర్టును ఆపరేట్ చేస్తున్న అటాటర్క్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ టిఎవి ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌తో ఈ మేరకు డీల్ కుదిరినట్టుగా చెబుతున్నారు. సబీహ గుర్క్‌చెన్ విమానాశ్రయంలో జిఎంఆర్‌కు 40 శాతం వాటా ఉండగా మలేసియా ఎయిర్‌పోర్ట్స్‌కు 20 శాతం వాటా, టర్కీ సంస్థ లిమాక్ హోల్డింగ్స్‌కు మరో 40 శాతం వాటా ఉంది. దాదాపు 38 వేల కోట్ల రూపాయల పైగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకునే సన్నాహాల్లో ఉన్న జిఎంఆర్ అందులో భాగంగానే ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు వాటా విక్రయానికి నిర్ణయించినట్టు చెబుతున్నారు. అదే కాకుండా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం మలేసియా ఎయిర్‌పోర్ట్స్ సంస్థకు ఉన్న 10 శాతం వాటాను కొనుగోలు చేసే ఆలోచనలో జిఎంఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. అసెట్ లైట్ -అసెట్ రైట్ మోడల్‌లో ఉన్న జిఎంఆర్ అప్రాధాన్యంగా భావిస్తున్న మరికొన్ని ఆస్తులను కూడా ఇటీవల కాలంలో విక్రయిస్తోంది.

వినోదం - తాజా - Google వార్తలు