జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఆకట్టుకున్నారు. ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (181 బంతుల్లో 119; 18 ఫోర్లు) అద్భుత సెంచరీతో చెలరేగాడు. అజింక్య రహానే (105 బంతుల్లో 43 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో పాటు కెప్టెన్ ధోని (46 బంతుల్లో 17 బ్యాటింగ్; 3 ఫోర్లు) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఓపెనర్లు విఫలం...
మొదటి నుంచి అనుకున్నట్లుగా వాండరర్స్ మైదానంలోని పిచ్ మరీ భయపెట్టలేదు. అదే రీతిలో దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు టీమిండియా బెంబేలెత్తిపోలేదు. ఆరంభంలో కొంత తడబాటుకు లోనైనా ఆ తర్వాత జట్టు కోలుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్‌తో ముంబై టెస్టు ఆడిన జట్టులో మూడు మార్పులతో రహానే, జహీర్, ఇషాంత్‌లకు తుది జట్టులో స్థానం లభించింది. స్టెయిన్ బౌలింగ్‌లో వరుసగా షార్ట్ బంతులను ఆడటంతో ఇబ్బంది పడిన ధావన్ (13) చివరకు అదే తరహా బంతిని పుల్ షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. ఆ వెంటనే మోర్కెల్ బౌలింగ్‌లో ఆమ్లా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన విజయ్ (6) తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. తమ తొలి స్పెల్‌లలో స్టెయిన్, మోర్కెల్ ప్రమాదకరంగా కనిపించారు. అయితే ఈ దశలో పుజారా (98 బంతుల్లో 25; 2 ఫోర్లు), కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. పుజారా క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వగా, కోహ్లి ఎదురుదాడికి దిగాడు. ఎలాంటి ఒత్తిడిని లోను కాకుండా చక్కటి షాట్లు ఆడాడు. దాంతో లంచ్ సమయానికి జట్టు స్కోరు 70 పరుగులకు చేరింది.
కోహ్లి నిలకడ...
లంచ్ తర్వాత కూడా భారత జోడి తమ జోరును కొనసాగించింది. స్వేచ్ఛగా ఆడిన కోహ్లి 76 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెషన్‌లో బౌలర్లెవరూ ప్రభావం చూపలేకపోయారు. ప్రధాన పేసర్లను జాగ్రత్తగా ఎదుర్కొన్న విరాట్...కలిస్, తాహిర్‌లపై చెలరేగి పరుగులు పిండుకున్నాడు. 40వ ఓవర్ చివరి బంతికి భారత్ స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే కోహ్లి పొరపాటుతో భారత్ కీలక వికెట్ కోల్పోయింది. తాహిర్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌వికెట్ వైపు నెట్టి కోహ్లి సింగిల్ కోసం ముందుకు దూసుకొచ్చాడు.
స్పందించిన పుజారా కూడా వేగంగా పరుగు కోసం వెళ్లాడు. అయితే మనసు మార్చుకున్న కోహ్లి మళ్లీ వెనకడుగు వేశాడు. పుజారా వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాహిర్ విసిరిన త్రోతో ఆమ్లా బెయిల్స్ పడగొట్టడంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు. దాంతో 89 పరుగులు భాగస్వామ్యానికి తెర పడింది. టెస్టుల్లో రెండు వరుస సెంచరీల రికార్డుతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ (14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఫిలాండర్ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి అతను అవుటయ్యాడు. టీ సమయానికి జట్టు 164 పరుగులు చేసింది.
ఆకట్టుకున్న రహానే...
టీ విరామం తర్వాత భారత్ జోరు కొద్ది సేపు తగ్గింది. దక్షిణాఫ్రికా పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌లో వరుసగా మెయిడిన్ ఓవర్లు వేశారు. అయితే మళ్లీ తాహిర్, పార్ట్‌టైమర్ డుమిని చేతికి బంతి వచ్చాక ఇద్దరూ స్వేచ్ఛగా ఆడారు. ఈ క్రమంలో కోహ్లి టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న రహానే కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఎట్టకేలకు కలిస్ 68 పరుగుల ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కలిసి బౌలింగ్‌లో డ్రైవ్ చేయబోయిన కోహ్లి కవర్స్‌లో క్యాచ్ ఇచ్చాడు. 80 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా కొత్త బంతి తీసుకున్నా లాభం లేకపోయింది. రహానేతో పాటు ధోని మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
20, డిసెంబర్ 2013, శుక్రవారండిసెంబర్ 20, 2013
ఇండియా 255/5: దక్షినాఫ్రికాతో తొలిటెస్ట్
By Fun Counter
20, డిసెంబర్ 2013, శుక్రవారం