Recent Posts

23 దాకా వేచి చూడండి!

26, డిసెంబర్ 2013, గురువారం

హైదరాబాద్, డిసెంబర్ 25 : 'విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ ముగిసేదాకా వేచి చూడండి! అందరం మాట్లాడుకుని భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందాం. అప్పటిదాకా ఓపిక పట్టండి!' అని ముఖ్యమంత్రి కిరణ్ తన సన్నిహితులైన నేతలకు సూచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఆ ప్రాంత నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీలతో అవగాహనను కుదుర్చుకున్నారు. ఇందులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేని కొందరు నేతలు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తుపై తలలు పట్టుకుంటున్నారు. తమకు దశా దిశా చూపించాలని వీరు ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిసిన ప్రతిసారీ కోరుతున్నారు. ఇప్పటి దాకా సీఎం తన మనసులో మాట బయటపెట్టడంలేదు. ఎవరేం అడిగినా... చిద్విలాసంగా నవ్వడమే మినహా, నోటితో ఒక్కమాటా చెప్పలేదు. దీంతో జనవరి 23 తర్వాత ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడతారని కొందరు, అలాంటి ఆలోచనే లేదని మరికొందరు ఎవరికి వారు భాష్యాలు చెబుతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిరణ్ వెంట నడవాలనుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి పతాక స్థాయికి చేరుకుంది.

 

'ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ, వైసీపీలతో అవగాహన కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని, మిమ్మల్ని నమ్ముకున్న మా పరిస్థితి ఏమిటి? మా రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే మేమందరమూ రాజకీయ విపత్తులో చిక్కుకు పోయాం. ఏం చేయాలో మీరే చెప్పండి' అని తమ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. 'కాస్త ఓపిక పట్టండి' అని కిరణ్ వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. "తొందర పడకండి. అసెంబ్లీలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై సవరణలు కోరుతూ ఓటింగ్‌ను నిర్వహించి ప్రతి క్లాజు వీగేలా చేద్దాం. జనవరి 23తో బిల్లుపై చర్చకు గడువు ముగుస్తుంది. ఆపై రెండు రోజుల తర్వాత మనందరం సమావేశమవుదాం. మీ అందరితో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ఉంటుంది. అప్పటి వరకూ ఎలాంటి ఆలోచనా వద్దు'' అని కొందరు మంత్రులు, శాసనసభ్యులతో ముఖ్యమంత్రి కిరణ్ చెబుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే 'కొత్త బ్యాట్'ను పట్టుకోవడం ఖాయమనిపిస్తోందని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

 

'అమ్మ'తో పలుకుతారా?..

3 నెలల తర్వాత రేపు సోనియాతో భేటీ

 

మూడు నెలల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు... వచ్చారు! కానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కాలేదు. అసలు అందుకు ఆసక్తి చూపలేదు. వెళ్లిన పని చేసుకురావడానికే పరిమితమయ్యారు. కారణం... విభజనపై 'మేడమ్'తో ప్రత్యక్ష యుద్ధానికి దిగడమే! ఇప్పుడు... ఆమెతో సమావేశమై తీరాల్సిన సందర్భం తలెత్తింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఆరోజు ఉదయం కిరణ్ ఢిల్లీకి వెళ్తున్నారు.

 

సుమారు మూడు నెలల తర్వాత సోనియాతో భేటీ కానున్నారు. ఆయన సోనియాగాంధీతో ఏం మాట్లాడతారు? అసలు ఏమైనా మాట్లాడతారా లేక అందరితోపాటు సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చేస్తారా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో... 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన అజెండాగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చినప్పుడు కిరణ్ ఏం చెబుతారనే విషయంపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

వినోదం - తాజా - Google వార్తలు