Recent Posts

తిరువనంతపురం, డిసెంబర్ 21: దేశంలో ఎన్నికల ప్రక్రియకు పెయిడ్ న్యూస్ వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని, కనుక దీనిని ఎన్నికల నేరంగా పరిగణించాలని ఎన్నికల కమిషన్ (ఇసి) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) వి.ఎస్.సంపత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సంస్కరణలపై శనివారం తిరువనంతపురంలో జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం ఇస్తూ, పెయిడ్ న్యూస్‌కు సంబంధించిన అవినీతి సమస్యలు ఎన్నికల్లో అడుగడుగునా దుష్ప్రభావం చూపుతున్నాయని, మీడియాతో పాటు అభ్యర్థులకు, ప్రజలకు ఇవి నష్టాన్ని కలిగిస్తూ ఎన్నికల ప్రక్రియపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక పెయిడ్ న్యూస్‌ను ఎన్నికల నేరంగా పరిగణించాలని, ఈ నేరానికి పాల్పడినవారు అందుకు తగిన పర్యవసానాలనను ఎదుర్కొనేలా చూడాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సంపత్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ విజయాలను ప్రజలకు వివరించేందుకు అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడాన్ని ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందే నిలిపివేయాలని అన్నారు. అయితే ఈ విషయంలో ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించిన పథకాలకు మాత్రం మినహాయింపు ఇవ్వాలన్నారు. ఎన్నికల రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉందని సంపత్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ విషయంలో తాము ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ రాజకీయాలకు నేరస్థులను దూరంగా ఉంచడం, రాజకీయ పార్టీల పనితీరులో పారదర్శకత తీసుకురావడం, వాటి నిధులపై ఆడిటింగ్ నిర్వహించడం తదితర అంశాలపై తక్షణమే దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. దేశంలో వయోజనుడైన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనేలా చట్టాన్ని తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని సంపత్ తోసిపుచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని, కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనేలా చట్టాన్ని రూపొందిస్తే 30 కోట్ల మంది ప్రజలపై కేసులు పెట్టాల్సి వస్తుందని, ఇప్పటికే అనేక పెండింగ్ కేసులతో సతమతమవుతున్న న్యాయ వ్యవస్థ ఈ అదనపు భారాన్ని ఎంతమాత్రం మోయలేదని ఆయన పేర్కొన్నారు. సదస్సు పూర్తయిన అనంతరం సంపత్ విలేఖర్లతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసులకు ప్రభుత్వ స్పందన ఏమిటని ప్రశ్నించగా, న్యాయశాఖ మంత్రితో పాటు పార్లమెంటేరియన్లనే ఈ ప్రశ్న అడగాలని సూచించారు. ప్రస్తుత లోక్‌సభ గడువు వచ్చే ఏడాది మే 31వ తేదీతో ముగియనున్నందున ఆ లోగానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని, దీనిని సక్రమంగా పూర్తిచేస్తామని సంపత్ చెప్పారు.

23, డిసెంబర్ 2013, సోమవారం

భీమవరం, డిసెంబర్ 22 : భీమవరంలో నిర్వహించిన 'భీమవరం బుల్లోడు' ఆడియో ఫంక్షన్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఓ యువకుడు మరణించాడు. స్థానిక డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన స్థానిక రైతుబజార్ ప్రాంతానికి చెందిన సంగిరెడ్డి సురేష్ (25) ప్రాణాలు కోల్పోయాడు. సంగిరెడ్డి రాంబాబు రెండో కుమారుడైన సురేష్ ఓ సూపర్‌బజార్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఏడాది వయసు కుమార్తె ఉన్నారు. లక్ష్మి ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. ఆదివారం మధ్యాహ్నం ఆమె పురుటి కోసం పుట్టింటికి వెళ్ళింది.

 

ఆడియో ఫంక్షన్‌ను చూసేందుకు  సురేష్ డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలోకి వెళ్లాడు. వేదిక సమీపంలో జరిగిన తొక్కిసలాటలో అతను స్పృహ కోల్పోయాడు. పోలీసులు అతడిని ఆటోలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేష్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోలీసులు అతని  ఇంటికి తరలించారు. ఆడియో ఫంక్షన్ నిర్వాహకులు, పోలీసుల వైఫల్యం వల్లే తన తమ్ముడు మృతిచెందాడని అతని అన్న మురళి ఆరోపించాడు. వేడుక ఏర్పాట్లను సక్రమంగా చేయకపోవటం, పోలీసుల ఓవర్ యాక్షన్ సురేష్ మృతికి కారణమని అతని బంధువులు పేర్కొన్నారు. 

 

 ఏర్పాట్లలో లోపమే కారణమా!

 ఈ వేడుకకు చేసిన ఏర్పాట్లలో లోపమే సురేష్ మృతికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో వేడుక నిర్వహించేందుకు అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు ఇక్కడ చేయలేదని తెలిపారు. ఈ వేడుక చూడటానికి వచ్చిన ప్రేక్షకులను పోలీసులు పదే పదే తోసివేయటంతో ఒకరి మీద ఒకరు పడగా ఈ దుర్ఘటన జరిగింది. బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్న భారీ ఫంక్షన్‌కు చేయాల్సిన ఏర్పాట్లు ఇక్కడ కనిపించలేదు. సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు లేవు.  పాస్‌లు చూపించిన వారిని పోలీసులు లోపలకు వెళ్లనీయకుండా మెయిన్ గేటు వద్ద గంటలతరబడి నిలబెట్టడం వల్ల అక్కడ కూడా తోపులాట జరిగింది.

. -

వినోదం - తాజా - Google వార్తలు